'రైతుబంధు'కు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
రైతులకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం 'రైతుబంధు' అనే సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. రైతన్నకు రుణం అందించి ఆర్థికంగా తోడ్పాటును అందిస్తోంది.
By అంజి Published on 18 Aug 2023 6:58 AM GMT'రైతుబంధు'కు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
రైతులకు అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం 'రైతుబంధు' అనే సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయం కోసం పెట్టుబడిని రుణంగా నగదు రూపంలో రైతన్నకు అందించి ఆర్థికంగా తోడ్పాటును అందిస్తోంది. సీఎం కేసీఆర్ 2018లో ఈ పథకాన్ని ప్రారంభించారు. మొదట ఈ స్కీమ్ ద్వారా ఎకరానికి ఖరీఫ్‌లో రూ. 4వేలు, రబీలో రూ.4 వేల చొప్పున ఏడాదికి 8 వేల రూపాయలను ప్రభుత్వం అందించింది. ఆ తరువాత పంట పెట్టుబడి సాయాన్ని ఎకరానికి రూ. 5వేలకు పెంచింది. ప్రస్తుతం ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు పెట్టుబడి సాయం పథకం.. దేశంలోనే మొదటిదని రాష్ట్ర సర్కార్ చెబుతోంది. ఏడాదికి సంబంధించి జూన్ 2023లో 11వ రైతుబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
ఇప్పటి వరకు మొత్తం 11విడుతల్లో ఈ పథకం ద్వారా రూ.72,910 కోట్ల ఆర్థిక సాయం సర్కార్ రైతులకు అందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి కొత్తగా 5 లక్షల మంది అన్నదాతలకు ఈ పథకాన్ని వర్తింపజేసింది. అలాగే 'రైతు బంధు' పథకానికి అర్హులుగా ఈ ఏడాది పోడు భూముల పట్టాలు పొందినవారిని అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో రైతుబంధు పథకం అందని రైతులు, కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులు, కొత్తగా పోడు పట్టాలు పొందిన రైతులు ఈ పథకం పరిధిలోకి రావాలంటే మొదట దరఖాస్తు చేసుకోవాలి. కాబట్టి నూతన లబ్ధిదారులు దరఖాస్తు సమయంలో ఏయే ఏయే పత్రాలు సమర్పించాలి, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
దరఖాస్తు సమయంలో కావాల్సిన పత్రాలు : రైతుబంధు దరఖాస్తు ఫారం, దరఖాస్తుదారుని పాస్‌బుక్, ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, బ్యాంక్ అకౌంట్ వివరాలు
దరఖాస్తు చేసుకునే విధానం: పైన పేర్కొన్న పత్రాలతో కొత్తగా అప్లికేషన్ పెట్టుకునే రైతు మొదట సంబంధింత గ్రామ వ్యవసాయ అధికారిని గానీ, మండల రెవెన్యూ అధికారిని గానీ సంప్రదించి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.