పటాన్‌చెరు ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోదరుడి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
By - Medi Samrat |
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోదరుడి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మహిపాల్‌రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డికి చెందిన రూ. 80 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లు సమాచారం. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ భారీగా అక్రమాలకు పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు విచారణ జరిపిన ఈడీ రూ.300 కోట్ల పైచిలుకు అక్రమ మైనింగ్ చేసినట్టు.. ప్రభుత్వానికి కోట్లలో రాయల్టీ చెల్లించలేదని గుర్తించింది. ఈ క్రమంలోనే గూడెం మధుసూదన్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డిల ఆస్తుల అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మైనింగ్‌కు అనుమతులు మంజూరు అవడం, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కావడం గమనార్హం. అయితే ఆ తర్వాత సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీపై ఆరోపణలు రావడంతో తెలంగాణ పోలీసులు సంస్థపై కేసు నమోదు చేయగా.. ఆ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది.
దర్యాప్తు సందర్భంగా సంతోష్ శాండ్ & గ్రానైట్ సప్లై యాజమాన్యం యజమాని అయిన గూడెం మధుసూధన్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలలో ఈడీ సోదాలు నిర్వహించి కీలక ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఆస్తులు బినామీ వ్యక్తుల పేర్లపై ఉండగా.. ఈ ఆస్తులకు అసలైన యజమాని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడని ఈడీ విచారణలో గుర్తించింది. సంతోష్ శాండ్ & గ్రానైట్ సప్లైకి మైనింగ్ లైసెన్స్‌ను ప్రభుత్వం మంజూరు చేయగా.. వారు దానిని గూడెం మధుసూధన్ రెడ్డి, జి విక్రమ్ రెడ్డి భాగస్వామ్య సంస్థ అయిన జివిఆర్ ఎంటర్‌ప్రైజెస్‌కు సబ్ కాంట్రాక్ట్‌గా ఇచ్చారని వెల్లడైంది. లీజు పరంగా ఈ సబ్ కాంట్రాక్టుకు అనుమతి లేదు. అలాగే సబ్ లీజ్‌కు ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతి తీసుకోలేదు.
చట్టవిరుద్ధంగా తవ్విన ఉత్పత్తులను ప్రధానంగా నగదు కోసం విక్రయించారని.. ఆ నగదును బినామీల పేర్లతో ఆస్తులలో పెట్టుబడి పెట్టారని ED దర్యాప్తులో వెల్లడైంది. ఇంకా.. చట్టవిరుద్ధంగా తవ్విన మెటీరియల్‌ని కొనుగోలు చేసిన వారి నుండి GVR ఎంటర్‌ప్రైజెస్‌కు డబ్బులు చెల్లించినట్లు కూడా ఈడీ గుర్తించింది. దీని ప్రకారం.. రూ.78.93 కోట్ల విలువైన 81 ఆస్తులను విచారణ సమయంలో తాత్కాలికంగా అటాచ్ చేశారు.