తెలంగాణలో మహిళలను కోటీశ్వరులను ఎలా చేస్తారో, నిర్ధిష్టమైన ప్రణాళికను కాంగ్రెస్ ప్రభుత్వం బహిర్గతం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయకపోవడంతో రాజకీయంగా మహిళలు నష్టపోతున్నారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టి, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయడంలేదు. మహిళా రిజర్వేషన్లు అమలుకాని కారణంగా మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా వంటి ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో మహిళలు తీవ్రంగా నష్టపోయారు. జనగణనకు బడ్జెట్‌లో ఎందుకు నిధులు కేటాయించలేదు.? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
రాష్ట్రంలో మహిళలకు ఇస్తామన్న రూ.2500 హామీని అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతాం. మహిళా సంఘాల ద్వారా అద్దెకు తీసుకుంటున్న బస్సులకు ఆర్టీసీ సకాలంలో కిరాయి చెల్లిస్తుందా లేదా స్పష్టత ఇవ్వాలి. గత ప్రభుత్వంలో మహిళల కోసం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేశారు. ఆయన పెట్టిన పథకాలను తీసివేసే కర్కోటక ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది. కేరళ ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో మహిళా, పురుషుల సమానత్వపు బొమ్మలు ప్రచురిస్తున్నారు. అలాంటి చర్యలు తెలంగాణలో కూడా రావాలని..ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలకు సమాన హక్కులు, గౌరవం, నిర్ణయాధికారం రావాల్సి ఉంది. అప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది...అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.