ఈ నెల 28న తెలంగాణకు అమిత్ షా
Home Minister Amit Shah to Visit Telangana on January 28. కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనవరి 28న తెలంగాణలో పర్యటించనున్నారు.
By అంజి Published on 11 Jan 2023 2:11 PM ISTకేంద్ర హోంమంత్రి అమిత్ షా జనవరి 28న తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్న నేపథ్యంలో సంక్రాంతి తర్వాత తెలంగాణ రాజకీయాలు వేడెక్కనున్నాయి. బీజేపీ సంస్థాగత సమస్యలను పరిష్కరించడమే అమిత్ షా రాష్ట్ర పర్యటనలో ప్రధాన లక్ష్యం అని తెలుస్తోంది. పార్టీ నేతలతో సమావేశమై పార్టీని ఎన్నికలకు సిద్ధం చేసి, అందుకు సంబంధించి అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. సంఘ్ పరివార్ నేతలతోనూ అమిత్ షా భేటీ అయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఉండనున్న అమిత్ షా.. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బూత్ స్థాయి కమిటీలు, మండల, ఇతర స్థాయి కమిటీల నియామకం తదితర విషయాలపై సమీక్షిస్తారు. అమిత్ షా పర్యటనతో రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరగడం ఖాయం. మోడీ, అమిత్ షాలపై కేసీఆర్ విమర్శలు చేస్తుంటే బీజేపీ నేతలు కేసీఆర్, కేటీఆర్ లను టార్గెట్ చేస్తూ వారి విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. కాగా వచ్చే ఆరు నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వాయిదా పడింది. వాస్తవానికి ఆయన ఈ నెల 19న తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో ప్రధాని సికింద్రాబాద్‌లో వందే భారత్ రైలును ప్రారంభించాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ప్రధాని పర్యటన వాయిదా పడింది.