హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 10, 11 తేదీల్లో పోలింగ్ కేంద్రాలుగా ఉన్న స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. అలాగే పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 11న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని పలు జిల్లాల కలెక్టర్లు ఆదేశించారు. రెండో దశ పోలింగ్ జరిగే 14న ఆదివారం, 13న రెండో శనివారం, మూడో దశ ఎన్నికలు జరిగే 17వ తేదీతో పాటు 16న కూడా స్కూళ్లకు సెలవులు ఇవ్వనున్నారు.
ఇదిలా ఉంటే.. సర్పంచ్ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్‌కు గడువు సమీపించింది. నేటితో 4,236 స్థానాల్లో ప్రచార పర్వం ముగియనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకే ప్రచారానికి అవకాశం ఉంది. అటు ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నేటి నుంచి ఎల్లుండి వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తొలి విడత పోలింగ్ సాగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు.