తెలంగాణలో భారీ వర్షాలు..ఈ జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు
తెలంగాణలో భారీ వర్షాలు పలు జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి
By Knakam Karthik
తెలంగాణలో భారీ వర్షాలు..ఈ జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు
తెలంగాణలో భారీ వర్షాలు పలు జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వర్షాలు మరింత జోరందుకున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత కురుస్తోంది. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాలో వరుణుడి ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. దీంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి.
వర్షాల తీవ్రత దృష్ట్యా కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఇవాళ కలెక్టర్ సెలవు ప్రకటించారు. ఇదే తరహాలో మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కూడా పాఠశాలలు మూతపడ్డాయి. పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కామారెడ్డి జిల్లా ఆర్గొండలో అత్యధికంగా 31.93 సెం.మీ., మెదక్ జిల్లా నాగాపూర్‌లో 20.88 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షం తీవ్రంగా పడుతుండటంతో అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. అత్యవసర పరిస్థితులు తప్ప ప్రజలు బయటకు రావొద్దని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. నేడు, రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్ నంబర్ 93919 42254కు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.