తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా హోలీ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. హోలీ వేడుకలకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో కూడా ఆంక్షలు విధించారు. గేటెడ్ కమ్యూనిటీల్లో ఎలాంటి వేడుకలు నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈవెంట్ ఆర్గనైజర్లతో పోలీసులు సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు హెచ్చరించారు.
ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇళ్లల్లోనే వేడుకలు చేసుకోవాలని, రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో గుంపులు, గుంపులుగా హోలీ జరుపుకోవద్దని సూచించారు. రోడ్లపై వెళ్లే వ్యక్తులపై, వాహనాలు, స్థలాలపై రంగులు, రంగునీళ్లు చల్లవద్దని హెచ్చరించారు. ఇళ్లల్లోకూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. హోలీ జరుపుకోవాలన్నారు. ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.