ఎస్‌ఈసీకి హైకోర్టు షాక్.. స్వ‌స్తిక్ గుర్తు ఉంటేనే..

HighCourt Shock To SEC. ఓ వైపు గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఉత్కంఠ రేపుతోన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్

By Medi Samrat  Published on  4 Dec 2020 10:59 AM IST
ఎస్‌ఈసీకి హైకోర్టు షాక్.. స్వ‌స్తిక్ గుర్తు ఉంటేనే..

ఓ వైపు గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఉత్కంఠ రేపుతోన్న సమయంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అర్థరాత్రి జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను రద్దు చేసింది హైకోర్టు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల బ్యాలెట్ ప‌త్రాల్లో స్వ‌స్తిక్ గుర్తు ఉన్న‌వాటినే కాకుండా సంబంధిత పోలింగ్ కేంద్రాన్ని సూచించే స్టాంపు వేసినా ఓట్లుగా ప‌రిగ‌ణించాలంటూ ఎస్‌ఈసీ గురువారం అర్థ‌రాత్రి ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఈసీ ఇచ్చిన ఆదేశాలపై కోర్టును ఆశ్రయిస్తూ.. బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ ఉద‌యం విచార‌ణ జ‌రిపిన హైకోర్టు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ ఉత్త‌ర్వుల‌ను నిలిపివేయాల‌ని ఆదేశించింది. కేవలం స్వస్తిక్ గుర్తు ఉన్న బ్యాలెట్ పేపర్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయని, మరే విధమైన పద్ధతుల్లో ఓటేసేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది.

ఈ సమాచారాన్ని వెంటనే కౌంటింగ్ కేంద్రాలకు అందించాలని ఆదేశించింది. ఫలానా పోలింగ్ స్టేషన్ లో స్వస్తిక్ గుర్తు అందుబాటులో లేదని ఈసీ చెప్పలేదని, అక్కడ పెన్నుతో గుర్తు పెట్టేందుకు అనుమతిస్తున్నామని కూడా ప్రకటించలేదని బీజేపీ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. దీంతో ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ధర్మాసనం, తుది ఉత్తర్వులకు లోబడి ఫలితాలు ఉంటాయని పేర్కొంటూ, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.


Next Story