మల్కాజ్‌గిరిలో ఉద్రిక్తత‌.. ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: ఎమ్మెల్యే మైనంపల్లి

High Tension In Malkajigiri. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన

By Medi Samrat  Published on  16 Aug 2021 8:18 AM GMT
మల్కాజ్‌గిరిలో ఉద్రిక్తత‌.. ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: ఎమ్మెల్యే మైనంపల్లి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన అనుచిత వ్యాఖ్యలు, శ్రావణ్‌పై దాడి ఘటన నేపథ్యంలో బీజేపీ బంద్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేఫ‌థ్యంలో మల్కాజ్‌గిరిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. షాపులను తెరవకుండా అడ్డుకుంటున్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠిచార్జ్ చేశారు. మల్కాజ్‌గిరి వినాయక నగర్ చౌరస్తా వద్ద బీజేపీ కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం.. తోపులాట చోటు చేసుకుంది. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. వెంటనే ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బంద్ నేఫ‌థ్యంలో మల్కాజిగిరిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దాడి, హెచ్చరికలు, ధర్నాలు, పోలీసు కేసులతో స్థానికంగా ఏర్పడిన పరిణామాలు నగరవ్యాప్తంగా కలకలం సృష్టించాయి. ఇవి ఎక్కడికి దారి తీస్తాయో అనే చర్చ నడుస్తోంది. ఈ దాడి వ్యవహారంలో గాయాల పాలైన శ్రావణ్‌ ఇచ్చిన ఫిర్యాదుతో పాటు బీజేపీకి చెందిన దళిత మహిళలు ఇచ్చిన ఫిర్యాదు.. ఇలా మొత్తం మూడు ఫిర్యాదులను అనుసరించి కేసు నమోదు చేశామని మల్కాజిగిరి పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్యే మైనంపల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

ఇదిలావుంటే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఆదివారం చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమాంతరావు అన్నారు. సోమవారం మాట్లాడుతూ.. మ‌రోమారు బండి సంజయ్ పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ నాకు ఒక్కరోజు అవకాశం ఇస్తే బీజేపీ నేతల అంతు చూస్తానని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన గుండు సంజయ్‌ను బరాబర్ తిడతానని మండిప‌డ్డారు. తనకు బహిరంగ క్షమాపణ చెబితే తప్ప నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.


Next Story
Share it