వీలైనంత త్వరగా సీరో సర్వే పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సర్వే నివేదిక సిఫార్సులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రేపటి నుంచి కరోనా బులెటిన్ రోజూ విడుదల చేయాలని స్పష్టం చేసింది.
కరోనా పరీక్షలపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించింది. జనవరి 25 నుంచి ఈ నెల 12 వరకు చేసిన పరీక్షల వివరాలు అందజేసింది. 1,03,737 ఆర్టీపీసీఆర్, 4,83,266 యాంటీజెన్ పరీక్షలు చేసినట్లు వెల్లడించింది. జూన్ 3 నుంచి డిసెంబరు వరకు 3 సార్లు సీరో సర్వేలు చేసినట్లు తెలిపింది.
రెండో దశ కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందన్న హైకోర్టు.. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్నాయని గుర్తు చేసింది. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ విధానంపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించింది. కరోనా కేసుల తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది.