న్యూ ఇయర్ వేడుకలను ఎందుకు బ్యాన్ చేయలేదు : ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
High Court Serious on Telangana Govt. తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. నూతన సంవత్సర వేడుకలను
By Medi Samrat
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. నూతన సంవత్సర వేడుకలను బ్యాన్ చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూ ఇయర్ వేడుకలను ఎందుకు బ్యాన్ చేయలేదని ప్రశ్నించింది. మీడియా కథనాలను సుమోటోగా తీసుకుని హైకోర్టు విచారించింది. ఓ వైపు కొత్త వైరస్ ప్రమాదకరమని హెల్త్ డైరెక్టర్ చెబుతుంటే.. వేడుకలకు ఎలా అనుమతి ఇచ్చారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచ్చలవిడిగా బార్లు తెరిచి ఏం చేయాలనుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. రాజస్థాన్, మహారాష్ట్రలో ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలను బ్యాన్ చేశారని హైకోర్టు వెల్లడించింది. ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించింది. వేడుకలు జరుపుకోవద్దని ప్రజలకు సూచించామని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం ఈ రోజు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. జనవరి 7న దీనిపై పూర్తి నివేదికను సమర్పించాలని హైకోర్టు తెలిపింది.
ఇదిలావుంటే.. తెలంగాణ ప్రభుత్వం బుధవారం మందుబాబులకు గుడ్‌న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ కానుకగా అర్థరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే బార్లు, క్లబ్‌లకు డిసెంబర్ 31 అర్థరాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఆబ్కారీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనాతో పాటుగా కొత్త స్ట్రెయిన్ వైరస్ భారత్‌లోకి ప్రవేశించడంతో అన్ని రాష్ట్రాలు నూతన సంవత్సర వేడుకలపై నిషేధాజ్ఞలు విధించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో అర్థరాత్రి వరకు మద్యం షాపులు ఓపెన్ చేయడం పట్ల హైకోర్టు సీరియస్ అయ్యింది.