స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పండి.? : హైకోర్టు
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో రెండు వారాల్లో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
By - Knakam Karthik |
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలి..ప్రభుత్వం, ఈసీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో రెండు వారాల్లో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్‌లను హైకోర్టు ప్రశ్నించింది. బీసీ రిజర్వేషన్‌లపై తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలును నిలిపివేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివరాలు సమర్పించడానికి ఎన్నికల సంఘం, ప్రభుత్వం గడువు కావాలని కోరడంతో తదుపరి విచారణను నవంబరు 3వ తేదీకి వాయిదా వేసింది. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై మాత్రమే స్టే ఇచ్చాం..ఎన్నికలను ఆపాలని కోర్టు ఎక్కడా చెప్పలేదు.. 50 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చు..అని హైకోర్టు స్పష్టం చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను నిలిపివేస్తూ ఈ నెల 9న ఎన్నికల సంఘం జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాల్ చేస్తూ ఆర్.సురేందర్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినందున ఇందులో ప్రత్యేకంగా ఆదేశాలు అవసరం లేదని పేర్కొంది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ల అమలుపై స్టే ఉన్నందున ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించాలంటే స్థానిక సంస్థల రిజర్వేషన్‌లలో కొన్ని మార్పులు ఉంటాయన్నారు. స్థానిక సంస్థల వారీగా రిజర్వేషన్‌లను కేటాయించాల్సింది ప్రభుత్వమేనని, అందువల్ల ఆ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. సమగ్ర వివరాలు తెలియజేయడానికి గడువు కావాలని కోరడంతో న్యాయస్థానం అనుమతిస్తూ విచారణను వాయిదా వేసింది.