మూసీ నదిని చూసి మురుగునీటి కాలువ అనుకున్నా.. అది నది అని నా డ్రైవర్‌ చెప్పాడు: హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌

High Court Chief Justice Satish Chandra called for protecting the environment. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పర్యావరణాన్ని రక్షించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర పిలుపు నిచ్చారు.

By అంజి  Published on  22 Nov 2021 9:32 AM IST
మూసీ నదిని చూసి మురుగునీటి కాలువ అనుకున్నా.. అది నది అని నా డ్రైవర్‌ చెప్పాడు: హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌

ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పర్యావరణాన్ని రక్షించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర పిలుపు నిచ్చారు. పర్యావరణాన్ని రక్షించే ప్రక్రియను కేవలం ప్రభుత్వ మీదనే వేయకుండా, ప్రతి పౌరుడూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ఆదివారం నాడు నాంపల్లి గగన్‌విహార్‌లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పిలేట్‌ అథారిటీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్‌ సతీష్‌, అథారిటీ చైర్మన్‌ జస్టిస్‌ ప్రకాశ్‌ రావుతో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ సతీష్‌ చంద్ర మాట్లాడారు.

తాను మధ్యప్రదేశ్‌లో ఉన్నప్పుడు హైదరాబాద్‌, హుస్సేన్‌సాగర్‌ గురించి ఎంతో గొప్పగా విన్నానని చెప్పారు. అయితే మొదటిసారి హైదరాబాద్‌ వచ్చినప్పుడు హుస్సేన్‌సాగర్‌ను చూడటానికి వెళ్లానని, అక్కడ 5 నిమిషాలు కూడా ఉండలేకపోయానన్నారు. రాష్ట్ర హైకోర్టు దగ్గర ఉన్న మూసీ నదిని చూసి మొదట్లో మురుగు నీటి కాలువ అనుకున్నానని, ఆ తర్వాత డ్రైవర్‌ అది నది అని చెప్పడంతో తాను ఆశ్చర్యపోయానని జస్టిస్‌ సతీష్‌ చంద్ర చెప్పారు. ఒక రోజు తాను ఎయిర్‌పోర్టుకు వెళ్తుంటే కొందరు సంచుల్లో చెత్తను తెచ్చి రోడ్ల పక్కనే పడేశారని, ఆ తర్వాత తన కొడుకు కారును ఆపి ఆ చెత్తను తీసుకెళ్లి డస్ట్‌బిన్‌లో వేశాడని అన్నారు.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో గల ఇండోర్‌ పట్టణానికి ఐదు సార్లు క్లీన్‌ సిటీ అవార్డు వచ్చిందన్నారు. అక్కడి కలెక్టర్‌, అధికారులు సులభ్‌కాంప్లెక్స్‌ల పక్కనే పుట్‌ఫాత్‌పై భోజనాలు చేశారని గుర్తు చేశారు. సరస్సులు, నదులు, పరిసర ప్రాంతాలను తీవ్ర కలుషితం చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని జస్టిస్‌ సతీష్‌ చంద్ర కోరారు. కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పాటు పడాలని జస్టిస్‌ చేతలు జోడించి వేడుకున్నారు.

Next Story