తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న మిస్ వరల్డ్ ఈవెంట్‌తో చార్మినార్, లాడ్ బజార్ లకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కనుంది. మిస్ వరల్డ్ ఈవెంట్ లో భాగంగా ఈ నెల 13న సాయంత్రం హైదరాబాద్ నగరంలోని చార్మినార్ , లాడ్ బజార్‌లలో హైదరాబాద్‌తో పాటు చార్మినార్ , లాడ్ బజార్ సాంస్కృతిక వైభవాన్ని, వైవిధ్యాన్ని చారిత్రక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసేలా హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. లాడ్ బజార్ లో మిస్ వరల్డ్ ప్రతినిధులు స్థానిక కళాకారులతో మాట్లాడనున్నారు.
120 దేశాల మిస్ వరల్డ్ ప్రతినిధులు హాజరయ్యే.... ఈ హెరిటేజ్ వాక్‌ను 150కి పైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు ఈ ఈవెంట్ ను తిలకిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున విదేశీ పర్యాటకులను తెలంగాణకు ఆకర్షించేలా ప్రణాళిలు సిద్ధం చేశారు. చారిత్రక చార్మినార్ కట్టడం, లాడ్ బజార్ ప్రత్యేకతలను మిస్ వరల్డ్ ప్రతినిధులు వివరించి వరల్డ్ టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్ గా ప్రమోట్ చేయనున్నారు.