హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న లారీని రెండు కార్లు ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారని సమాచారం. ప్రమాద ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి దగ్గర చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైవేపై 2 కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలంకు వెళ్లారు. ప్రమాదంలో ధ్వంసమైన వాహనాలను రోడ్డుపై నుండి తొలగించిన పోలీసులు.. ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి 65పై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత నెల నవంబర్ 27వ తేదీన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గండ్రాంపల్లి వద్ద అదుపు తప్పి ఓ లారీ బోల్తా పడింది. డివైడర్‌ను ఢీ కొన్న లారీ రోడ్డు మధ్యలో పడిపోవడంతో రాకపోకలను అంతరాయం కలిగింది. సుమారు 4 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.