తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు.. 3 వేల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్
తెలంగాణలో న్యూ ఇయర్ వేళ రూ.125 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 2023 చివరి 4 రోజుల్లో రాష్ట్రంలో రూ.750 కోట్ల విలువైన మద్యం విక్రయించబడింది.
By అంజి Published on 2 Jan 2024 5:36 AM GMTతెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు.. 3 వేల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు బుక్
హైదరాబాద్: తెలంగాణలో నూతన సంవత్సరం సందర్భంగా రూ.125 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 2023 చివరి నాలుగు రోజుల్లో రాష్ట్రంలో రూ.750 కోట్ల విలువైన మద్యం విక్రయించబడింది. తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ (TSBC) ప్రకారం.. 2023 చివరి రోజున రూ.135 కోట్ల నుంచి రూ.150 విలువైన మద్యం విక్రయించబడింది. డిసెంబర్ 28న రూ.133 కోట్ల మద్యం విక్రయాలు జరగగా.. డిసెంబర్ 29న అమ్మకాలు రూ.179 కోట్లకు పెరిగాయి. డిసెంబర్ 30న ఈ సంఖ్య రూ.313 కోట్లకు చేరింది. ఎక్సైజ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం డిసెంబర్ 31న 19 ప్రభుత్వ డిపోల నుంచి 1.30 లక్షల కార్టన్‌ల మద్యం, 1.35 లక్షల కార్టన్‌ల బీరు విక్రయాలు జరిగాయి.
3000 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు:
హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో నూతన సంవత్సరం సందర్భంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా మద్యం తాగి వాహనాలు నడిపినందుకు 3,001 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి డిసెంబర్ 31, 2023 న రాత్రి 8 నుండి జనవరి 1 ఉదయం వరకు డ్రైవ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1,243 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడగా, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1,241 మందిపై, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 517 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత వారందరినీ నిర్ణీత సమయంలో కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.
స్విగ్గీలో 4.8 లక్షలకు పైగా బిర్యానీలు ఆర్డర్ చేయబడ్డాయి:
నూతన సంవత్సరం సందర్భంగా స్విగ్గీలో 4.8 లక్షలకు పైగా బిర్యానీలు ఆర్డర్ చేయబడ్డాయి, ప్రతి నిమిషానికి 1,244 యూనిట్లు గరిష్టంగా ఆర్డర్ చేయబడ్డాయని ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌తో పనిచేసే వర్గాలు తెలిపాయి. గత సంవత్సర రికార్డు తిరగ రాసి 4.8 లక్షల బిర్యానీల ఆర్డర్ లతో 2024 కొత్త సంవత్సరం రికార్డు సృష్టించింది. గతంలో కంటే 160 శాతం ఎక్కువ ఆర్డర్లు వచ్చినట్లు వెల్లడించింది. 2023 వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా 1.3 లక్షల ఆర్డర్లు వచ్చినట్టు వివరించింది. దేశవ్యాప్తంగా నిమిషానికి 1,722 కండోమ్‌లను ఆర్డర్ చేయగా, వీటిని స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ ద్వారా డెలివరీ చేసినట్టు స్విగ్గీ తెలిపింది.