ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

Heavy rains water flow in godavari. తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. గోదావరి

By అంజి  Published on  11 July 2022 2:25 AM GMT
ఉగ్రరూపం దాల్చిన గోదావరి..  రెండో ప్రమాద హెచ్చరిక జారీ

తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. గోదావరి ప్రాజెక్టులకు ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతోంది. శ్రీరాంసాగర్ నుంచి భద్రాద్రి వరకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. అన్ని ప్రాజెక్ట్‌లు నిండుకుండల్లా మారాయి. దీంతో అధికారులు ప్రాజెక్ట్‌ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మహారాష్ట్ర, ఆదిలాబాద్‌, కరీంనగర్, నిజామాబాద్‌ జిల్లాల్లో గోదావరి ఉపనదులన్నీ పొంగిపోర్లుతున్నాయి.

భద్రాచలం వద్ద నదిలో గంటగంటకు వరద ప్రవాహం పెరిగిపోతున్నది. ఎగువనుంచి భారీగా వరద పోటెత్తడంతో రాములవారి పాదాల వద్ద గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాద్రిలో స్నానఘట్టాల ప్రాంతం నీటమునిగింది. గోదావరి దిగువన ఉన్న ముంపు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదవారి నది ప్రవాహం భారీగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

రాష్ట్రానికి భారీ వర్షం ముప్పు ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. గత పదేళ్లలో జులై నెలలో అత్యధిక వర్షం పాత నమోదు కావడం ఇదేనని పేర్కొంది. ఇవాళ, రేపు భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు పెరగడంతో 19 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. 19 గేట్లు ద్వారా 26,182 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నిజామాబాద్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 85,740 క్యూసెక్కులు కొనసాగుతోంది.

Next Story