తెలంగాణలో భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు పోటెత్తున్న వరద

Heavy rains in Telangana.. Flood water pouring into projects. భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి.

By అంజి  Published on  26 July 2022 11:12 AM IST
తెలంగాణలో భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు పోటెత్తున్న వరద

భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం తడిసి ముద్దవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. నిన్న రాత్రి నుంచి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జిల్లాలోని వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నిన్న అర్ధరాత్రి వికారాబాద్‌, సంగారెడ్డి, నిజామాబాద్‌, రంగారెడ్డి, హన్మకొండ, సిద్ధిపేట జిల్లాల్లోతో పాటు హైదరాబాద్‌ మహానగర పరిధిలో భారీ వర్షం కురిసింది.

మరోవైపు హైదరాబాద్‌లోని ఉస్మాన్‌సాగర్‌కు వరద పోటెత్తింది. దీంతో సాగర్‌ ఆరు గేట్లను జలమండలి అధికారులు ఎత్తి 1872 క్యూసెక్కుల నీటిని మూసిలోకి వదిలారు. అలాగే వర్షానికి హుస్సేన్‌సాగర్‌ వరద పెరిగింది. పూర్తిస్థాయి నీటిమట్టం దాటిపోయింది. ప్రస్తుతం నీటిమట్టం 513.45 మీటర్లు ఉన్నది. పూర్తిస్థాయినీటిమట్టం 513.41 మీటర్లు.

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. ముంపు ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ అధికారులు పర్యటిస్తున్నారు. సురారం తెలుగుతల్లి నగర్‌లో మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచింది. పటేల్‌నగర్‌లోని సాయికృప అపార్ట్‌మెంట్‌ జలమయమైంది. అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లోని వాహనాలు నీటమునిగాయి. పలుచోట్ల రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రోడ్లపై నిలిచిన వరద నీటిని జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు.

నిర్మల్‌ జిల్లాలోని స్వర్ణ రిజర్వాయర్‌కి వరద నీరు వచ్చి చేరుతోంది. స్వర్ణ రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1180 అడుగులుగా ఉంది. స్వర్ణ రిజర్వాయర్‌లోకి 3 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, రిజర్వాయర్‌ ఒక గేటు ద్వారా 5,800 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. బాసరలతో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. వరద నీటితో బాసర రైల్వే స్టేషన్‌, పరిసర ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. రవీంద్రపూర్‌ కాలనీని వరద నీరు చుట్టు ముట్టింది.


వికారాబాద్‌ జిల్లాలో భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సర్పన్‌పల్లి ప్రాజెక్ట్, చెరువులు పూర్తిగా నిండి.. జలకళను సంతరించుకున్నాయి. మహబూబాబాద్‌లోని అర్పనపల్లి వద్ద వట్టి వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో కేసముద్రం - గూడూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌కు వరద ప్రవహం కొనసాగుతోంది. నాగర్జునసాగర్‌ ఇన్‌ఫ్లో 57,669 క్యూసెక్కులు ఉండగా, విద్యుత్‌ ఉత్పత్తికి 5,378 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటి మట్టం 544.50 అడుగులుగా ఉండగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు.

గోదావరి నదిలో వరద ప్రహవం పెరుగుతోంది. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 43.2 అడుగులుగా ఉంది. భద్రాచలం దగ్గర గోదావరిలో 9.41 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.


Next Story