బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో జోరుగా వాన‌లు

Heavy Rains for another three days in Telangana.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 July 2021 11:55 AM IST
బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో జోరుగా వాన‌లు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. రాగల రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో పడే అవకాశం ఉందని అంచ‌నా వేసింది. బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల వద్ద అల్ప‌పీడ‌నం ఏర్ప‌డింది. ఇప్పటికే తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో ఉపరితల ద్రోణి 2.1 కిమీ ఎత్తులో ఏర్పడి ఉండడంతో అల్పపీడనం మరింత బలపడి భారీ ఉరుములు, మెరుపులతో తెలంగాణ‌లో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేసిన‌ట్లుగానే ఆదివారం తెల్ల‌వారుజాము నుంచి వరంగల్‌, హన్మకొండ, కాజీపేటలో వ‌ర్షం కురుస్తుంది. దీంతో రోడ్లన్నీ జలమయమవగా, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. నర్సంపేట, పరకాల డివిజన్లు, ధర్మసాగర్‌, వేలేరు మండలాల్లో భారీ వర్షం కురుస్తున్నది. మహబూబాబాద్‌ జిల్లాలోని గూడూరు, కొత్తగూడెం, గంగారం మండలాల్లో వాన పడుతున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, టేకులపల్లి, గండాల, ఆళ్లపల్లి మండలాల్లో, ఖమ్మం జిల్లావ్యాప్తంగా వర్షం కురుస్తున్నది. పాలేరు, ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది.

ఆదివారం ఉదయం 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో అత్యధికంగా 14.9 సెంటీమీటర్లు, కుమ్మెరలో 14.6 సెం.మీ., నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో 11.4, ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండలో 10, కరీంనగర్‌ జిల్లా తాడికల్‌లో 8.85 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.

Next Story