Telangana: పలు జిల్లాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం.. వడగండ్ల వాన

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది. ఎండల తీవ్రత తగ్గి పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

By అంజి  Published on  7 May 2024 12:37 PM GMT
Heavy rains, Telangana, IMD, TS Weather, Rain forecast

Telangana: పలు జిల్లాల్లో ఈదురు గాలులతో భారీ వర్షం.. వడగండ్ల వాన

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది. ఎండల తీవ్రత తగ్గి పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని కొంపల్లి, సుచిత్ర, శేరిలింగపల్లి, జీడిమెట్ల, కొండాపూర్‌లో వాన పడింది. మియాపూర్‌లో వడగండ్ల వర్షం కురిసింది. మేడ్చల్‌, కండ్లకోయ, దుండిగల్‌, గండిమైసమ్మ, చందానగర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, ప్యారడైజ్‌, మారేడ్‌పల్లి, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, ప్రాంతాల్లో వర్షం కురిసింది.

తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌ జోరుగా వర్షం పడింది. పొద్దంతా భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాల్లో ఈదురుగాలులు పలు చోట్ల వర్షం కురిసింది. మానుకొండూరు, హుజురాబాద్‌, పెద్దపల్లి, వేములవాడలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీ జన జాతర ప్రాంగణంలో భారీ ఈదురు గాలుల వర్షానికి టెంట్లు కూలిపోయాయి. కుర్చీలు విరిగిపోయాయి. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలకు పలు కొనుగోలు కేంద్రాల్లోని రైతుల ధన్యం తడిసిపోయింది. చెట్లు విరిగి పడటంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

తెలంగాణలో రాగల ఐదు రోజుల పాటు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, భువనగిరి, రంగారెడ్డి, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటలకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. మరికొన్ని జిల్లాల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, కాకినాడ, శ్రీకాకుళం, అల్లూరి జిల్లాల్లోనూ జోరుగా వర్షం కురిసింది. విజయవాడలో ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు కురిశాయి. దీంతో వేడి, ఉక్కపోత నుంచి నగరవాసులకు ఉపశమనం కలిగింది.

Next Story