తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్‌లో పిడుగులు పడే ఛాన్స్
హైదరాబాద్‌లో పిడుగులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
By అంజి Published on 27 Sept 2023 11:00 AM IST
తెలంగాణలో వర్షాలు.. హైదరాబాద్‌లో పిడుగులు పడే ఛాన్స్
హైదరాబాద్‌లో పిడుగులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఎల్లో అలర్ట్‌ను జారీ చేసిన ఐఎండీ.. నగరంలో వర్షం బుధవారం నాడు ప్రారంభమై నెలాఖరు వరకు కొనసాగుతుందని తెలిపింది. గణేష్ నిమజ్జనం రోజు కూడా ఈ మధ్యలోనే జరగనుంది. సెప్టెంబరు 28న నాడు గణేష్‌ల నిమజ్జనం జరగనుంది. ఓ మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ హెచ్చరిక సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుంది. అక్టోబర్ 1 నుండి వర్షపాతం తగ్గే అవకాశం ఉంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దీనికి తోడుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో అక్టోబర్ 1 వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ సర్క్యులేషన్ వల్ల గురు, శుక్ర, శనివారాల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా. బుధవారం రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, వికారాబాద్, సిద్దిపేట, యాదాద్రి, వనపర్తి, జనగాం సహా పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వానలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాబోయే వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులు కోరారు. గణేష్ నిమజ్జనం రోజు సమీపిస్తున్నందున, నిర్వాహకులు పాల్గొనే వారందరి భద్రతకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇందులో వాతావరణ అప్‌డేట్‌లను పర్యవేక్షించడం, నీటితో నిండిన ప్రాంతాల వైపు వెళ్లకపోవడం, స్థానిక అధికారులు జారీ చేసే ఏవైనా సలహాలు లేదా హెచ్చరికలను అనుసరించడం వంటివి ఉంటాయి.