బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Heavy rain forecast for Telugu states. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలి రాగల 36 గంటల్లో వాయుగుండంగా

By అంజి  Published on  14 Aug 2022 12:45 PM IST
బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలి రాగల 36 గంటల్లో వాయుగుండంగా బలపడే ఛాన్స్‌ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలలో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఈ వాయుగుండం ప్రభావం తెలంగాణపై తక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఇప్పటికే దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ యానాంలలో పశ్చిమ గాలుల ప్రభావం తక్కువగా ఉందని పేర్కొంది.

కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు పడుతున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, మాసబ్‌ట్యాంక్‌, లక్డీకపూల్‌, నాంపల్లి, ఖైరతాబాద్‌, అమీర్‌పేట్‌, పంజాగుట్టలో వాన పడుతున్నది. అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి.

హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉన్నది. ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌, వరంగల్‌, హనుమకొండ, కరీంనగర్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. ఈ నెల 17వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

Next Story