బీసీలకు 42% రిజర్వేషన్లు.. నేడు సుప్రీంలో విచారణ.. వాదనలు వినిపించనున్న తెలంగాణ సర్కార్

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. అక్టోబర్ 6వ తేదీన (సోమవారం) ఇది విచారణకు రానుంది.

By -  అంజి
Published on : 6 Oct 2025 6:46 AM IST

Supreme Court, 42 percent reservation, BCs, Telangana govt, Telangana

బీసీలకు 42% రిజర్వేషన్లు.. నేడు సుప్రీంలో విచారణ.. వాదనలు వినిపించనున్న తెలంగాణ సర్కార్

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. అక్టోబర్ 6వ తేదీన (సోమవారం) ఇది విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో బలమైన వాదనలు వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ తరపున ఉన్నత స్థాయి బృందం ఢిల్లీకి వచ్చి సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, అడ్వకేట్ ఆన్ రికార్డ్ శ్రవణ్ కుమార్ , బీసీ సంక్షేమ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్, కోఆర్డినేషన్ సెక్రటరీ డా. గౌరవ్ ఉప్పల్, బీసీ రెసిడెన్షియల్ సొసైటీల సెక్రటరీ సైదులు, బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌ మల్లయ్య భట్టు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో.. సుప్రీం కోర్టులో అక్టోబర్ 6న జరుగనున్న విచారణకు సంబంధించి సమగ్ర సమీక్ష జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సాక్ష్యాలు, సర్వే వివరాలు, చట్టపరమైన అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ వర్గాల రాజకీయ ప్రతినిద్యం పెంచే దిశగా 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం కృషి చేస్తోందని మంత్రులు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా డోర్‌ టు డోర్‌ సర్వే నిర్వహించి పూర్తి వివరాలు సేకరించినట్టు వెల్లడించారు. ఆ తర్వాత జులైలో ఆర్డినెన్స్‌ జారీ చేసి.. ఆగస్టు 30న బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిందని వివరించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు ప్రకటించాయని చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై సీరియస్‌గా వ్యవహరిస్తున్నారని మంత్రులు వివరించారు. అందుకే మంత్రివర్గం తరఫున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరిలను సుప్రీం కోర్టులో విచారణకు ముందు ప్రభుత్వ తరఫున సమన్వయం కోసం పంపారు. అదే సమయంలో.. విదేశంలో ఉన్న అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీ తో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ద్వారా మాట్లాడారు. ఆయన అక్టోబర్ 6న జరిగే విచారణకు హాజరవుతున్నట్లు తెలియజేశారు. బీసీ సంఘాల నాయకులు, న్యాయవాదులు అందరూ ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారని మంత్రులు స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సాంఘిక న్యాయం, సమాన రాజకీయ ప్రతినిధిత్వం దిశగా ఒక చారిత్రాత్మక అడుగుగా నిలవనుందని.. మంత్రులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలలో బీసీ వర్గాల రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచే దిశగా ప్రభుత్వం రెండు సార్లు చట్టసభలో బిల్లులు ఆమోదించిందన్నారు. ఈ చట్టం అమలు కావడానికి రాష్ట్రపతి అనుమతి అవసరం ఉందని.. రాష్ట్రపతి కార్యాలయం, కేంద్ర ప్రభుత్వం అడిగిన వాటిని నివృత్తి చేయడం జరిగింది.

Next Story