తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యంగా ముప్పై ఏళ్ళ క్రితం కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన తాను వైద్య విద్య చదువుకోవడానికి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న హైద్రాబాద్ రావడానికి అనేక వ్యయ ప్రయాసలు ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాదించుకున్నకారణంగానే ఆరోగ్య తెలంగాణ దిశగా ముందుకు సాగడం సాధ్యపడిందని తెలిపారు.
మారుమూల గిరిజన యువత అధికంగా నివాసముండే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆధునిక హంగులతో కార్పొరేట్ వైద్య కళాశాలకు ధీటుగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు పుష్పగుచ్చం అందచేశారు. ఈ సందర్భంగా తెలంగాణాలో ప్రజారోగ్యం మెరుగుపరిచేందుకు ప్రభుత్వ ప్రతినిధిగా హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు చేస్తున్న కృషిని అభినందిస్తూ.. మరింత ఉత్సాహంగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.