సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఫొటోలకు ఫోజులు ఇస్తూ ఓ వృద్ధురాలికి రెండు సార్లు వ్యాక్సిన్ వేసిన ఘటన చోటు చేసుకుంది. ఆదివారం నాడు జోగిపేట రిక్షాకాలనీలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ క్రమంలోనే వైద్య సిబ్బంది సాబేరా బేగం (63)కు వ్యాక్సిన్ వేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అక్కడి మున్సిపల్ సిబ్బంది వచ్చి వ్యాక్సినేషన్ డ్రైవ్ ఫొటో కావాలని అడిగారు. ఇందుకు కోసం ఆ కాలనీలో వ్యాక్సిన్ వేసిన వారందరినీ వరుసగా నిలబెట్టారు. వరుసలో నిలబడ్డ సాబేరా బేగం చేతికి సిరంజి పెట్టి వైద్య సిబ్బంది ఫొటో దిగారు. అనంతరం సాబేరాకు మళ్లీ వ్యాక్సిన్ వేశారు. దీంతో తనకు మళ్లీ వ్యాక్సిన్ వేయడంపై సాబేరా బేగం ఆందోళన చెందింది. ఆమెను ప్రస్తుతం జోగిపేటలోని ఆస్పత్రిలో అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య
భారత్‌లో గడిచిన 24 గంటల్లో 12,514 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 12,718 కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 251 మంది మృతి చెందారు. తాజాగా నమోదైన కరోనా కేసులతో.. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 3,42,85,814కు చేరింది. దేశంలో ప్రస్తుతం 1,58,817 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 1,06,31,24,205 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది.