ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో బీఆర్‌ఎస్ సన్నాహాక సమావేశానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హారీశ్ రావు మాట్లాడుతూ.. ఖమ్మం సభతో తెలంగాణ, సీఎం కేసీఆర్ సత్తాను దేశానికి చాటాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌కు ఈ సభ చాలా ముఖ్యమైనదని చెప్పారు. జనవరి 18న నిర్వహించబోయే ఈ సభకు మూడు రాష్ట్రాల సీఎంలు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌తో పాటు జాతీయ స్థాయి నాయకులు వస్తున్నారని తెలిపారు. దేశంలో ఇంతకుముందు ఎన్నడూ ఇలాంటి సభ జరగలేదని తెలిపారు.
సభకు పాలేరు నుంచి 50 వేల మందికి తగ్గకుండా రావాలని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. దేశంలో తెలంగాణపై ప్రత్యేక చర్చ జరుగుతోందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతోందని ఎద్దేవా చేశారు. కేంద్రం రైతు బంధు స్కీమ్‌ను కాపీ కొట్టి రైతులకు రూ.2 వేలు ఇస్తోందన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు కాకపోగా.. పెట్టుబడి రెండింతలు అయ్యిందని విమర్శించారు. నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతులను కేంద్రంలోని బీజేపీ పొట్టన పెట్టుకుందని ఫైర్ అయ్యారు.
పాలేరు నియోజకవర్గంలో రెండు నదుల నీళ్లు పారుతున్నాయని హరీశ్ రావు చెప్పారు. కృష్ణా, గోదావరి నీళ్లు పారే ఏకైక నియోజకవర్గం ఒక్క పాలేరేనని వెల్లడించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో 9 నెలల్లోనే భక్త రామదాసు పూర్తి చేసుకున్నామని, ఈ ఘటన బీఆర్‌ఎస్ పార్టీదేనని అన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా చేశారని అన్నారు.