సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్, హరీష్ రావు ఘాటు రిప్లై..!

తెలంగాణ శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ అంశంపై మాట్లాడుతూ.. డ్రగ్స్ వెనుక ఎవరు ఉన్నా ఊచలు లెక్కబెట్టించాలని

By Medi Samrat  Published on  16 Dec 2023 1:22 PM GMT
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్, హరీష్ రావు ఘాటు రిప్లై..!

తెలంగాణ శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ అంశంపై మాట్లాడుతూ.. డ్రగ్స్ వెనుక ఎవరు ఉన్నా ఊచలు లెక్కబెట్టించాలని, మిగతా విషయాలలో అధికార, ప్రతిపక్షాల మధ్య భేదాభిప్రాయాలు ఉండవచ్చునని, కానీ డ్రగ్స్ మహమ్మారి విషయంలో నిందితులను శిక్షించాలనే తమ ప్రభుత్వ అభిప్రాయాన్ని ప్రతిపక్షం అభినందించవలసిన అవసరం లేదా? అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వండి... అని సభాపతి ప్రసాద్ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ మాజీ మంత్రి కేటీఆర్‌కు మైక్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి మాట్లాడి మాట్లాడి అలసిపోయారని.. బ్రేక్ తీసుకోమనండి... అని ఎద్దేవా చేశారు. ఢిల్లీని మేనేజ్ చేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, ఢిల్లీని మేనేజ్ చేసి టీపీసీసీ చీఫ్ అయిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు. ఈ మాటలు తాను చెప్పడంలేదని... మేనేజ్‌మెంట్ కోటాలో వచ్చిందని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారని వెల్లడించారు. వెంటనే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... సభ్యుడికి ఇలాగైనా పరివర్తన వస్తుందనుకున్నానని... సభ్యుడు ఈ ఒక్క అంశానికే (డ్రగ్స్)కే పరిమితమై చర్చించి మద్దతు ఇస్తారని భావించానని వ్యాఖ్యానించారు. కానీ తనను నిరాశపరిచారన్నారు. ఎప్పటి లాగే రాజకీయ ఆరోపణలు చేశారన్నారు. కాబట్టి తాను అన్నీ చెబుతానని రేవంత్ రెడ్డి అన్నారు.

హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే ఆయన ముఖ్యమంత్రిగా భావిస్తున్నట్లు కనిపించడం లేదన్నారు. ఇంకా టీపీసీసీ అధ్యక్షుడిగా, ప్రతిపక్షంలో ఉన్నట్లుగా మాట్లాడుతున్నారన్నారు. తమ పార్టీని కుటుంబ పార్టీ అంటున్నారని, కానీ నెహ్రూ నుంచి ఇప్పటి వరకు అది కుటుంబ పార్టీ అన్నారు. పీవీ నరసింహా రావును అవమానించారని ఆరోపించారు. మా మాట వినాల్సిందే.. వినే వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇక్కడి నుంచి పోనీయనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, నేనూ అదే చెబుతున్నానని.. ఎంత సమయం వరకైనా మాట్లాడుదాం.. నేను కూడా వారిని పోనీయనని చెప్పారు. ఎంతసేపైనా మాట్లాడుదామన్న వారి మాటల్లో నిజాయితీ ఉంటే మా సమాధానం ఓపికగా వినాలన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడింది తాను రాసుకొని మరీ సమాధానం చెబుతున్నానని వివరించారు హరీష్ రావు.

Next Story