రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ

భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.

By Medi Samrat  Published on  25 Feb 2024 6:23 PM IST
రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ

భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి హరీష్ రావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి)లో విలీనం వంటి ప్రధాన సమస్యలపై లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి, ఆమోదింప చేసిందన్నారు. శాసనసభ, గవర్నర్ ఆమోదించిన బిల్లును అమలు చేసే ‘అపాయింటెడ్ డే’ మాత్రమే మిగిలి ఉందన్నారు. ఎన్నికల కోడ్ రావడంతో మా ప్రభుత్వం విలీన నిర్ణయాన్ని అమలు చేసే ‘అపాయింటెడ్ డే’ నిర్వహించలేకపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విలీన బిల్లును అమలు చేసి, ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతామని చెప్పిందని అన్నారు. కార్మికులకు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందని ఇచ్చిన హామీని మీ దృష్టికి తెస్తున్నానని హరీష్ రావు లేఖలో తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర నెలలు గడుస్తున్నా అపాయింటెడ్ డేను ప్రకటించలేదని అన్నారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించిన నాడే, ఆర్టీసీ విలీనానికి సంబంధించిన జీవో విడుదల చేస్తారని కార్మికులు, ఉద్యోగులు ఆశించారని అన్నారు హరీష్ రావు. కానీ నేటి వరకు విలీనానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రవేశ పెట్టిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ముఖ్యంగా మహిళా కండక్టర్లపై పనిభారం చాలా పెరిగిందన్నారు. ప్రయాణీకుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం 1000 డీజిల్ బస్సులను కొనుగోలు చేయడంతో పాటు, 500 ఎలక్ట్రిక్ బస్సులను కిరాయికి కూడా తెప్పించింది. వాటిని కూడా మీరే ఇటీవల ప్రారంభించారు. పెరిగిన మహిళల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 2000 బస్సులను అదనంగా కొనుగోలు చేయాలని కోరుతున్నానని లేఖలో కోరారు హరీష్ రావు.

Next Story