ప్రజల సాక్షిగా అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ గొంతు నొక్కుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ లో ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తూ జీరో అవర్ నిర్వహించడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విపక్షంలో తమతో పాటు ఉన్న ఎంఐఎం పార్టీకి కూడా మంత్రులను ప్రశ్నలు అడిగేందుకు కనీస అవకాశం ఇవ్వకపోవడం దారుణమని ఫైర్ అయ్యారు. ఇదే అంశంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ప్రశ్నించినా.. ఆయన నుంచి సమాధానం లేకపోవడం ఆశ్చర్యంగా ఉందని కామెంట్ చేశారు.
సభ్యుల హక్కులను కాపాడే బాధ్యత స్పీకర్‌పైనే ఉందని.. ప్రశ్నోత్తరాల రద్దు చేయడంపై ఆయన వెంటనే సమాధానం చెప్పాలని అన్నారు. మరోవైపు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను సైతం ఆన్‌లైన్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయని అన్నారు. హెచ్ఎండీఏ భూములను తాకట్టు పెట్టి మరో రూ.20 వేల కోట్లు అప్పు తెచ్చేందుకు సర్కార్ రెడీ అవుతోందని వాటిపై మాట్లాడేందుకు సభలో మాట్లాడేందుకు తమకు అవకాశం కల్పించడం లేదని హరీశ్ రావు ధ్వజమెత్తారు.