చట్టం మీద నమ్మకం, గౌరవం ఉంది.. ఎక్కడకు పిలిచినా వస్తా : హరీష్‌ రావు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు విచారణ ముగిసింది.

By -  Medi Samrat
Published on : 20 Jan 2026 7:42 PM IST

చట్టం మీద నమ్మకం, గౌరవం ఉంది.. ఎక్కడకు పిలిచినా వస్తా : హరీష్‌ రావు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో సిట్‌ అధికారులు దాదాపు ఏడుగంటలకుపైగా ఆయనను విచారించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు విచారణ కొనసాగింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణకు హాజరుకావాలని శనివారం సాయంత్రం సిట్‌ అధికారులు హరీష్‌రావుకు నోటీసులు పంపించడంతో ఆయన ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అప్పటి నుంచి సాయంత్రం 6.30 గంటలకు వరకు అధికారులు ఆయనను ప్రశ్నించారు. అయితే విచారణ సందర్భంగా న్యాయవాదులను లోపలికి అనుమతించలేదు. దాంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.దాంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సిట్‌ అధికారులైన ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్‌రెడ్డి ఆయనను విచారించారు.

ఈ విష‌య‌మై హరీష్‌రావు తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మాకు ఉద్యమాలు కొత్త కాదని.. ఇలాంటి అక్రమ కేసులు సమైక్య రాష్ట్రంలో చాలా పెట్టారని, మీరు ఇచ్చిన నోటీసు లు మా గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఉదయం మీ బామ్మర్ది బాగోతం బయట పెడితే సాయంత్రం నాకు నోటీసులు ఇచ్చారన్నారు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నాకు నోటీసులు ఇవ్వడం కాదని, రాజకీయంగా కోట్లాడుదాం అని సవాల్‌ విసిరారు. నీ దోపిడీకి అడ్డు వస్తున్నామని చిల్లర రాజకీయాలు చేస్తున్నావు అంటూ ధ్వజమెత్తారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గర లోనే ఉన్నాయన్నారు. మాకు చట్టం మీద నమ్మకం గౌరవం ఉందని, నువ్వు ఎక్కడకు పిలిచినా వస్తానన్నారు. రేవంత్ రెడ్డి చూసుకో.. నిన్ను అసలు వదిలి పెట్టను.. మళ్ళీ నైట్ ఇంకో లీక్ ఇస్తారు.. దమ్ముంటే ఇవాళ నన్ను అడిగిన ప్రశ్నలు, జవాబులు అన్ని బయటపెట్టు అని స‌వాల్ విసిరారు. వీడియో మొత్తం బయటపెట్టు, చిల్లర లీకులు కాదంటూ ఫైర్‌ అయ్యారు. ఈ నోటీసులు మమ్మల్ని బయటపెట్టవని, నీ పతనాన్ని వేగవంతం చేస్తాయన్నారు. నన్ను ప్రశ్నలు అడగడం కాదని, వాళ్లకే నేను వందల ప్రశ్నలు వేశానని హరీష్‌ రావు తెలిపారు. అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ లను విచారణ కు పిలవాలి అన్నానని, శివధర్ రెడ్డి, మహేందర్ రెడ్డి లను విచారణకు పిలవాలి అని డిమాండ్ చేశానన్నారు. ఫోన్ టాపింగ్‌తో నాకేం సంబంధం.. నేను హోం మంత్రి కాదు కదా అని హరీష్‌ రావు వ్యాఖ్యానించారు. సైట్‌ విజిట్‌ సర్టిఫికేట్‌ పేరుతో జరిగిన కుంభకోణాన్ని బట్టబయలు చేశామని, చీటికి మాటికి సిట్‌లు వేస్తున్నారు కదా.. విచారణ జరిపించండని అన్నారు.

Next Story