కేసీఆర్ తెలంగాణ సాధించకపోతే రేవంత్ చంద్రబాబుతోనే ఉండేవారు : హరీష్ రావు

పాలక పక్షం ఆత్మరక్షణలో పడ్డప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు, సత్య దూరమైన అంశాలను లేవనెత్తుతూ సభను పక్క దారి పట్టిస్తున్నారని.. ప్రతి సమవేశంలోనూ ఇదే జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

By Medi Samrat  Published on  29 July 2024 5:08 PM IST
కేసీఆర్ తెలంగాణ సాధించకపోతే రేవంత్ చంద్రబాబుతోనే ఉండేవారు : హరీష్ రావు

పాలక పక్షం ఆత్మరక్షణలో పడ్డప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు, సత్య దూరమైన అంశాలను లేవనెత్తుతూ సభను పక్క దారి పట్టిస్తున్నారని.. ప్రతి సమవేశంలోనూ ఇదే జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. సభా నాయకుడు ఆదర్శంగా ఉండాల్సింది పొయి సభలో అబద్దాలు మాట్లాడుతున్నారు.. గత సమావేశాల్లో మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యం కాదని రిటైర్డ్ ఇంజినీర్లు నివేదిక ఇచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదని అబద్ధమాడారు.. రిటైర్డ్ ఇంజినీర్ల వాదన వేరే లాగా ఉంటే సీఎం మరోలా చెప్పి సభను తప్పు దోవ పట్టించారన్నారు.

నిన్నటి సమావేశంలో విద్యుత్ మీటర్ల పై కూడా తప్పుడు పత్రంతో సీఎం సభను తప్పు దోవ పట్టించారు.. తనకు కావాల్సిన వాక్యం చదివి మిగతా పదాలు వదిలేశారన్నారు. ఈ అంశం పై మేము ఇప్పటికే వాయిదా తీర్మానం ఇచ్చాము.. సీఎంపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం కూడా ఇస్తామ‌న్నారు. నేను వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు కేసీఆర్ ఒప్పుకోలేదు అంటే ఆ సందర్భంలో ఉదయ్ స్కీం ఒప్పందం చదివి వ్యవసాయ మీటర్లకు ఒప్పుకున్నట్టు భ్రమింప జేశారన్నారు. పోతిరెడ్డి పాడుపై వైఎస్ హాయంలో మేము పదవుల కోసం పెదవులు మూసుకున్నాం అని రేవంత్ మాపై ఆరోపణలు చేశారు. పోతిరెడ్డి పాడుపై జీఓ రాకముందే మేము వైఎస్ కేబినెట్ నుంచి వైదొలిగామని.. మేము రాజీనామా చేయడానికి పోతిరెడ్డి పాడు సహా అనేక అంశాలు కారణం అన్నారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నది రేవంత్ రెడ్డి అని.. తానేదో తెలంగాణ ఛాంపియన్ అయినట్టు సీఎం మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారని అన్నారు.

తెలంగాణ ప్రకటన వెనక్కి పోతే మేము రాజీనామా చేసాం ..రేవంత్ రెడ్డి కనీసం డూప్లికేట్ రాజీనామా కూడా చేయలేదన్నారు. రేవంత్ లాంటి వాళ్ళు రాజీనామా చేయలేదనే ఆనాడు బలిదానాలు జరిగాయి.. ఆనాటి అమరుల లేఖలు చూస్తే బలిదానాలకు కారణం ఎవరో తెలుస్తుందన్నారు. కేసీఆర్ లాగా రాజీనామాలు చేసిన చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా.? అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ ప్రకటన వచ్చిందన్నారు. 14 ఏళ్ల‌ తెలంగాణ ఉద్యమంలో రేవంత్ తెలంగాణ కోసం పని చేయలేదన్నారు. కేసీఆర్ తెలంగాణ సాధించకపోతే రేవంత్ చంద్రబాబుతోనే ఉండే వారు.. రేవంత్ తెలంగాణ ఉద్యమ కారులపై దాడికి రైఫిల్ తో బయలు దేరారని.. అలాంటి రేవంత్ తెలంగాణ ఛాంపియన్ ను తానే అని చెప్పుకోవడం దయ్యాలు వేదాలు వల్లించడం లాంటిదేన‌న్నారు.

రేవంత్ పీసీసీ అధ్యక్షుడు అయినా ఇపుడు సీఎం అయినా అది తెలంగాణ వచ్చిన ఫలితమే ..కేసీఆర్ పుణ్యమేన‌న్నారు. ఎల్ఆర్ఎస్ గురించి రేవంత్ అప్పుడు ఏం మాట్లాడారు.. ఇప్పుడేం చేస్తున్నారని ప్ర‌శ్నించారు. కోమటిరెడ్డి, భట్టి, ఉత్తమ్ ఎల్ఆర్ఎస్‌ను ఫీజులు లేకుండా చేయాలని ఆనాడు డిమాండ్ చేశారు ..ఇప్పుడేం చేస్తున్నారు.. అన్నీ ద్వంద్వ ప్రమాణాలేన‌ని దుయ్య‌బ‌ట్టారు.

బీఆర్ఎస్ పని అయిపోయింది అని సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌కు గతంలో దేశంలో రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా రాలేదు.. అయినా ఆ పార్టీ పని అయిపోయిందా.? రెండు సార్లూ కాంగ్రెస్ ను మేమే ఓడించాం.. కాంగ్రెస్ పని అయిపోయిందా.? కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో గతంలో 18 రాష్ట్రాల్లో ఖాతా తెరవలేదు.. కాంగ్రెస్ పని అయిపోయిందా.? అని ప్ర‌శ్నించారు. ఇండియా కూటమి 28 పార్టీలతో ఏర్పడ్డది.. కాంగ్రెస్ అందులో గెలిచిన సీట్లు 99 అని అన్నారు.

జైపాల్ రెడ్డి పెద్ద తెలంగాణ వాది తాను చిన్న తెలంగాణ వాది అని రేవంత్ మాట్లాడుతున్నారు. జైపాల్ రెడ్డి తెలంగాణకు ఏ పార్టీ నైనా ఒప్పించారా.? కేసీఆర్ 36 పార్టీలను ఒప్పించారని అన్నారు. తెలంగాణ వస్తుంది అనే వాతావరణం ఏర్పడ్డాకే రేవంత్ తెలంగాణకు అనుకూలంగా మాట్లాడారని అన్నారు. రేవంత్ ఇప్పటికే మూడు సార్లు అబద్దపు అంశాలతో సభను తప్పు దోవ పట్టించారు. మీడియా కూడా రేవంత్ అబద్దాలను ఎండ గట్టాలి. రుణ మాఫీ పై రేవంత్ ది గోబెల్స్ ప్రచారం అని విమ‌ర్శించారు. 31 వేల కోట్ల రూపాయలు రుణ మాఫీకి అవుతుందని 25 వేల కోట్లే బడ్జెట్ లో పెట్టారని అన్నారు.

Next Story