తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రోజు రోజుకి భానుడి వేడి సెగలు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పగటి పూట గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ఒంటి పూట స్కూళ్లు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 16వ తేదీ నుండి ఒంటి పూట బడులు నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. ఒంటి పూట బడులను ఉదయం 7.45 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించాలని సర్కార్ భావిస్తోంది. మే మూడో వారం వరకు ఒంటి బడులు కొనసాగుతాయి. మరో వైపు మే 20వ తేదీన 10వ తరగతి పరీక్షలు పూర్తికానున్నాయి. అదే రోజు బడులకు చివరి పని దినం కానుంది. ఇక మళ్లీ జూన్ 12వ తేదీ నుండి కొంత విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. కాగా మార్చి 15 నుంచి పాఠశాలల చివరి పనిదినం వరకు సగం రోజుల పనివేళలతో వేసవి పాఠశాలలను నిర్వహించేలా జిల్లా విద్యాశాఖ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంది.