మునుగోడు ప్రజలు కోమటిరెడ్డి బ్రదర్స్‌కు తగిన బుద్ధి చెప్పారు
Gutha Sukender Reddy Comments On Komatireddy Brothers. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని కోమటిరెడ్డి సోదరులు
By Medi Samrat Published on 8 Nov 2022 7:30 PM ISTరాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని కోమటిరెడ్డి సోదరులు మరోసారి నిరూపించారని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. అన్న వెంకట్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతుండగా, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి తప్ప ఏమీ సాధించలేదన్నారు. బై ఎలక్షన్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పొలిటికల్ సూసైడ్ చేసుకున్న వారితో సమానం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ప్రజలు కోమటిరెడ్డి బ్రదర్స్ కు తగిన బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. తాను ముందుగా చెప్పినట్లుగా మునుగోడు ఉప ఎన్నిక ఫలితం కోమటిరెడ్డి సోదరుల రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపిందని ఆయన అన్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల పేద, మధ్య తరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపిందన్నారు. కేంద్రంలో ప్రత్యామ్నాయం లేకపోవడంతో నరేంద్ర మోదీ భారత ప్రధానిగా కొనసాగుతున్నారు. అందుకే, మతతత్వ పార్టీని ఎదుర్కొనేందుకు లౌకిక శక్తులను ఏకం చేసేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)ను ప్రారంభించారని ఆయన అన్నారు.
రాజకీయాల్లో ఒకరినొకరు గౌరవించుకునే సంస్కృతి కనుమరుగయ్యిందని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు మాట్లాడే ముందు తమ మాటలను బేరీజు వేసుకోవాలి. ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది లేదా ఏడాదిన్నర వస్తాయని పేర్కొంటూ.. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌కు మద్దతివ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. గత మూడేళ్లలో నల్గొండ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయని, ఈ మూడు ఉప ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మరిన్ని ఉప ఎన్నికలకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.