కర్ణాటక ప్ర‌భుత్వంతో మాట్లాడి వెంట‌నే ఆ ప‌ని చేయండి

గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో అల్ టైమ్ అత్యధిక రికార్డ్ స్థాయిలో ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని

By Medi Samrat  Published on  27 Feb 2024 3:41 PM IST
కర్ణాటక ప్ర‌భుత్వంతో మాట్లాడి వెంట‌నే ఆ ప‌ని చేయండి

గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో అల్ టైమ్ అత్యధిక రికార్డ్ స్థాయిలో ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. గత పదియేండ్లు అత్యధిక వర్షపాతం నమోదు అవ్వడం వలన ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, జలకళతో నిండు కుండలా కనిపించాయి.. పంటలు సమృద్ధిగా పండినవి.. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు వర్షాలు లేవు.. తీవ్ర వర్షాభావ పరిస్థితులు వచ్చాయి.. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో నీరులేకపోవడంతో ఆయకట్టు కింద క్రాఫ్ హాలిడేలు ప్రకటించారన్నారు. ప్రస్తుతానికి అన్నదాతలు బోర్ల కింద, బావుల కింద వ్యవసాయం చేస్తున్నారు. భూగర్భజలలు ఎండిపోయాయి. బావులు ఎండిపోయాయి. పొట్ట దశలో ఉన్న పంటలు అన్ని ఎండిపోతున్నాయి.

ఈ నేప‌థ్యంలో కర్ణాటక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కావున తెలంగాణ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే 15 నుండి 20 టీఎంసీల నీటిని తీసుకువచ్చి, ఎండిపోతున్న పంట పొలాలను కాపాడాలని కోరారు. కనీసం ఒక్క తడికైనా నీటిని అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడాలి.. పంటలను కాపాడాలన్నారు. మార్చి నెల తర్వాత తెలంగాణలో మంచి నీటి ఎద్దడి వచ్చే ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల బాధలను ముందుగానే అర్థం చేసుకోవాలి. ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు.

వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో బీఆర్ఎస్ అధిష్టానం ఎవరికీ పార్టీ టికెట్ ఇచ్చినా వారికి సహకరిస్తామ‌న్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమ‌న్నారు. సమన్వయంతో పని చేస్తే ఫలితాలు వస్తాయన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. నా కుమారుడు నల్గొండ లేదా భువనగిరి నుండి.. ఎక్కడ ఇచ్చిన పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామ‌న్నారు.

Next Story