Telangana: నేటి నుంచే గ్రూప్-3 పరీక్షలు.. అభ్యర్థులు ఈ సూచనలు పాటించాల్సిందే
గ్రూప్-3 పరీక్షలకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు సిద్ధం చేసింది. నేడు, రేపు జరిగే ఈ పరీక్షల కోసం సెంటర్ల వద్ద పకడ్బందీ చర్యలను చేపట్టింది.
By అంజి Published on 17 Nov 2024 1:03 AM GMTTelangana: నేటి నుంచే గ్రూప్-3 పరీక్షలు.. అభ్యర్థులు ఈ సూచనలు పాటించాల్సిందే
హైదరాబాద్: గ్రూప్-3 పరీక్షలకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు సిద్ధం చేసింది. నేడు, రేపు జరిగే ఈ పరీక్షల కోసం సెంటర్ల వద్ద పకడ్బందీ చర్యలను చేపట్టింది. ఈ క్రమంలోనే అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక సూచనలు చేసింది. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ తీసుకుని రావాలి. హాల్ టికెట్ ఉన్నవారినే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక ఒరిజినల్ ఐడీని( పాస్ పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఐడీ లేదా డ్రైవింగ్ లైసెన్స్) చూపించాల్సి ఉంటుంది.
హాల్ టికెట్ పై ఫొటో క్లియర్ గా ఉండాలి. ఇలా లేకపోతే గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకోవాలి. ఉదయం 08. 30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. 09.30 గంటలకు గేట్లు మూసివేస్తారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను లోపలికి తీసుకెళ్లరాదు. మాల్ ప్రాక్టీసింగ్, చీటింగ్ వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని టీజీపీఎస్సీ తెలిపింది.
ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్‌లో పేపర్ -1 ఎగ్జామ్ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 05:30 వరకు సెకండ్ పేపర్ పరీక్ష జరుగుతుంది. రేపు పేపర్-3 ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతుంది. గ్రూప్ 3 పరీక్షలో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున 450 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కో పేపరు రాసేందుకు రెండున్నర గంటల సమయం ఉంటుంది. ప్రతి పేపర్‌లోనూ 150 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేయనున్నారు. గ్రూప్ 3 పోస్టులకు ఎలాంటి ఇంటర్వూ ఉండదు. ఈ గ్రూప్ 3 నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 1,388 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.