Ground Report: ప్రజావాణి వాయిదా.. హైదరాబాద్‌కు తిరగలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు
రేషన్ కార్డు నంబర్‌ను తప్పుగా నమోదు చేయడం వల్ల మలక్‌పేటకు చెందిన హెవీ వెహికల్ డ్రైవర్ ఇనాయత్ అలీకి దక్కాల్సిన ప్రభుత్వ స్కీమ్ లు దక్కడం లేదు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Aug 2024 5:38 AM GMTGround Report: ప్రజావాణి వాయిదా.. హైదరాబాద్‌కు తిరగలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు
రేషన్ కార్డు నంబర్‌ను తప్పుగా నమోదు చేయడం వల్ల మలక్‌పేటకు చెందిన హెవీ వెహికల్ డ్రైవర్ ఇనాయత్ అలీకి దక్కాల్సిన ప్రభుత్వ స్కీమ్ లు దక్కడం లేదు. దీంతో ఆయన ప్రజాభవన్‌ను పలుమార్లు సందర్శించారు. ప్రజావాణి కార్యక్రమానికి హాజరై తమ ఫిర్యాదులను నమోదు చేయడానికి, తమ సమస్యలను పరిష్కరించాలంటూ ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడి ప్రజాభవన్‌ను సందర్శిస్తున్నారు.
NewsMeter మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌ను సందర్శించినప్పుడు, ఇనాయత్ అలీ లాంటి అనేక మంది సమస్యలతో చేస్తున్న సావాసం గురించి చెప్పుకొచ్చారు. రేషన్ కార్డులు, హెల్త్ కార్డ్‌లు, పట్టాదార్ పాస్‌బుక్‌లు మంజూరు కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారిని మేము కనుగొన్నాము. డబుల్ బెడ్‌రూంల మంజూరు, కేటాయింపులు, వివిధ శాఖల్లో ఉద్యోగాలు తదితర సమస్యలపై పలువురు ప్రజాభవన్ కు క్యూ కట్టారు.
‘నాలుగుసార్లు సందర్శించినా పరిష్కారం లేదు’
సంక్షేమ పథకాలు, ఫిర్యాదులకు సంబంధించిన కాగితాలను పట్టుకుని హైదరాబాద్ కు వస్తూ ఉన్నారు. స్థానిక స్థాయిలోనే పరిష్కారం చూపించే అంశాలపై హైదరాబాద్ దాకా రావాల్సి వస్తోందని తెలిపారు.
న్యూస్‌మీటర్‌తో తన దుస్థితిని పంచుకున్న ఇనాయత్ అలీ “నా భార్య డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు, ఉచిత గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు నెలవారీ రూ. 2,500 సహాయం కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందేందుకు సంబంధించిన అన్ని పత్రాలను ఆన్‌లైన్‌లో సమర్పించాం. అయితే అధికారులు రేషన్ కార్డు వివరాలను సరిగ్గా నమోదు చేయలేదు. మేము వెంటనే మండల కార్యాలయంలో సమస్యను లేవనెత్తాము, అక్కడ అధికారులు జాప్యం చేసారు. సత్వర పరిష్కారం కోసం ప్రజావాణిలో ఫిర్యాదు చేయమని నా భార్యకు సూచించారు. నా భార్య ఇప్పటి వరకు నాలుగు సార్లు ప్రజా భవన్‌కు వెళ్లినా మా సమస్య తీరలేదు" అని తెలిపారు.
దాదాపు 45 రోజుల క్రితమే తన పొత్తికడుపుకు శస్త్ర చికిత్స జరిగిందని, తాను కూడా ఇతర పనులు చేసుకునే పరిస్థితి లేదని ఇనాయత్ అలీ తెలిపారు. “ఎటువంటి అవకాశం లేకపోవడంతో నా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి నేను ప్రజా భవన్‌కు వచ్చాను. నా రేషన్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయమని విజ్ఞప్తి చేసాను. అయితే, అధికారులు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు, ”అని వివరించారు.
సంక్షేమ పథకాల దరఖాస్తుల పరిశీలనలో జాప్యం
డబుల్ బెడ్‌రూం ఇండ్ల కేటాయింపుపై ఇనాయత్ అలీ మాట్లాడుతూ.. ప్రజావాణిలో అధికారులు దరఖాస్తులను మాత్రమే స్వీకరిస్తున్నారని, అయితే దరఖాస్తులను మండల స్థాయి కార్యాలయాల్లో పరిశీలిస్తామని తెలిపారన్నారు. “అటువంటి అవకాశం ఉంటే, ప్రక్రియను క్రమబద్ధీకరించకుండా ప్రజాపాలన ద్వారా ప్రజలకు ఆరు హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు హామీలు ఇచ్చింది” అని అలీ ప్రశ్నించారు.
ప్రజావాణిలో ఫిర్యాదుల ప్రక్రియ ఏమిటి?
కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘ఆరు హామీల’ కోసం ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలి. రిఫరెన్స్ ఐడీ నంబర్‌ను రూపొందించే ముందు, ప్రజావాణికి సమర్పించిన ప్రతి దరఖాస్తు స్కాన్ చేస్తారు. నిర్దిష్ట ID నంబర్ సంబంధిత విభాగానికి ఫార్వార్డ్ చేస్తారు. దరఖాస్తుదారు ఫోన్‌కు SMS ద్వారా అందించబడుతుందని అధికారులు తెలిపారు.
ప్రజావాణి 50 వారాల మార్క్‌కు చేరుకోగా, తమకు వచ్చిన 5,23,940 దరఖాస్తులలో 4,31,348 ప్రాసెస్ అయ్యాయని, మిగిలిన 92,592 దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రజావాణికి వచ్చిన ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇళ్లు, తెల్ల రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు కొన్ని అధికారిక ప్రక్రియల కారణంగా పెండింగ్‌లో ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో పునః నియామకం కోసం:
ప్రజావాణి ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధి సంబంధిత ఫిర్యాదులను కూడా ప్రాసెస్ చేస్తుంది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగుకు చెందిన పురుషోత్తం ప్రభుత్వ పాఠశాలల్లో మాన్యువల్ స్కావెంజర్ (మురుగునీటి కార్మికుడు)గా మళ్లీ నియామకం కోసం ప్రజాభవన్‌లో అధికారులకు వినతి పత్రం సమర్పించారు.
2016- 2021 మధ్య, ప్రభుత్వ పాఠశాలల్లో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం సుమారు 28,200 మందిని స్కావెంజర్లుగా నియమించింది. కోవిడ్ -19 తర్వాత, BRS ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు పూర్తి బాధ్యతలను అప్పగించడంతో మాకు ఉపాధి లేకుండా పోయింది. గత ప్రభుత్వ హయాంలో నియమించిన స్కావెంజర్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల నుండి స్పందన గురించి అడగగా, అధికారులు తన ఫిర్యాదును నమోదు చేశారని, తనకు మెమోరాండం సమర్పించడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ (MA&UD) దానకిషోర్‌ను కలవాలని కోరారని పురుషోత్తం చెప్పారు.
రుణమాఫీ అమలు చేయాలని కోరుతున్న రైతులు:
మహబూబ్‌నగర్‌కు చెందిన సంజీవ్ అనే రైతు రుణమాఫీ పథకం అమలు కోసం వేచి ఉన్నారు. రెండుసార్లు ప్రజాభవన్‌ను సందర్శించారు. రుణమాఫీలో తన తల్లి పేరును చేర్చాలని ఆయన చేసిన విజ్ఞప్తిని అధికారులు ఇంకా పరిగణనలోకి తీసుకోలేదు. సంజీవ్ తల్లికి కోయిలకొండ మండలంలో మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. రుణమాఫీ పథకం అమలుకు సంబంధించి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలను పాటించలేదు. ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ పథకం అమలుకు కటాఫ్ డేట్ పెట్టింది. కానీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఎలాంటి కటాఫ్ తేదీని పేర్కొనలేదన్నారు.
ప్రజావాణి అంటే ఏమిటి?
ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వారానికి రెండుసార్లు ప్రజావాణిని నిర్వహిస్తున్నారు. మంగళవారం, శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే సకాలంలో ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడంలో జాప్యం చేయడంతో ప్రజా వాణి పట్ల ప్రజల్లో ఉన్న ఆశలు, ఆకాంక్షలు ఆవిరవుతూ ఉన్నాయి.