Ground Report: బీఆర్‌ఎస్‌ గోపీనాథ్ Vs కాంగ్రెస్ అజారుద్దీన్.. జూబ్లీహిల్స్ లో గెలుపెవరిది?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జూబ్లీహిల్స్ మరో సారి చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ 2.9 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

By Bhavana Sharma  Published on  8 Nov 2023 10:09 AM IST
BRS, Gopinath, Congress, Azharuddin, Jubilee Hills, Telangana Polls

Ground Report: బీఆర్‌ఎస్‌ గోపీనాథ్ Vs కాంగ్రెస్ అజారుద్దీన్.. జూబ్లీహిల్స్ లో గెలుపెవరిది? 

హైదరాబాదులోని జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలు రియల్ ఎస్టేట్ ధరల కారణంగా సాధారణంగా వార్తల్లో ఉంటాయి. ఎన్నో తెలుగు సినిమాల్లో కూడా జూబ్లీ హిల్స్ ప్రస్తావన ఉన్న సంగతి తెలిసిందే!! జూబ్లీ హిల్స్ అంటే బాగా డబ్బున్న వాళ్లు నివసించే ప్రాంతాలు, పెద్ద పెద్ద రెస్టారెంట్స్, పోష్ కాలనీలు, పబ్ లకు ప్రసిద్ధి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జూబ్లీహిల్స్ మరో సారి చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్‌లోని సెంట్రల్ రెసిడెన్షియల్, వాణిజ్య ప్రాంతాలు నియోజకవర్గ సరిహద్దుల్లోకి రావు. నియోజకవర్గంలో గణనీయమైన 70% మురికివాడలు, తక్కువ-ఆదాయ వనరులు ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోకి ఎర్రగడ్డ, బోరబండ, యూసుఫ్‌గూడ, శ్రీనగర్‌ కాలనీ, షేక్‌పేట ప్రాంతాలు వస్తాయి. ఇక్కడ 2.9 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో తమ అభ్యర్థిగా భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ పేరును కాంగ్రెస్‌ పార్టీ ఇటీవలే ప్రకటించింది. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్‌కు, బీజేపీ నుంచి లంకాల దీపక్‌రెడ్డికి టికెట్ దక్కింది. అజారుద్దీన్ 2009లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ పార్లమెంటరీ సీటులో విజయం సాధించారు. ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో పరాజయాలను ఎదుర్కొంటూ వచ్చారు. 2014లో టోంక్-సవాయి మాధోపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో పరాజయాన్ని ఎదుర్కొన్నారు. 2019లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడిగా పోటీ చేసి విజయం సాధించారు. అయినప్పటికీ, అంతర్గత విభేదాలు, న్యాయపరమైన చిక్కులు అజారుద్దీన్ ను వెంటాడాయి. అధ్యక్షుడిగా పనిచేసిన క్లబ్ లో ఓటరు జాబితా నుండి కూడా అజర్ పేరును తొలగించేశారు.

అజారుద్దీన్ క్రికెట్ లెజెండ్‌గా అంతర్జాతీయ ఖ్యాతిని పొందినప్పటికీ.. ఈ నియోజకవర్గంలో ఆయనకు ఊహించిన మద్దతు లభిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. బోరబండలోని ఒక వీధిలో హార్డ్‌వేర్ దుకాణం యజమాని కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. "అతను టీవీలో క్రికెట్ ఆడుతూ ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా నాకు తెలుసు. అంతకు మించి ఎవరికీ తెలియదు. కొన్ని న్యాయపరమైన సమస్యలు, వివాదాల గురించి చదివినట్లు జ్ఞాపకం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులలో మాలాంటి మధ్యతరగతి ప్రజలు తప్పుడు కారణాలతో వార్తల్లోకి వచ్చిన వ్యక్తికి ఓటు వేయాలని అనుకోరు. రాబోయే ఐదేళ్లపాటు మమ్మల్ని ఎవరు బాగా చూసుకుంటారో వారికే మద్దతు ఇవ్వాలని అనుకుంటాము" అని తెలిపారు.

అనుభవజ్ఞుడైన AIMIM నాయకుడిగా, ఫరాజుద్దీన్ అభ్యర్థిత్వం ఇక్కడ ఆసక్తికరమైన పోటీకి కారణమవుతోంది. షేక్‌పేట్‌లో కార్పొరేటర్‌గా పనిచేసిన అతని మునుపటి అనుభవం, ప్రజా సేవ పట్ల ఆయనకున్న అంకితభావం ఉంది. స్థానికులతో బాగా కలిసిపోయిన వ్యక్తి ఫరాజుద్దీన్. స్థానికుల సమస్యలు ఏమిటో ఆయనకు తెలుసు.. ప్రజల ఆకాంక్షలపై లోతైన అవగాహన కలిగి ఉన్న వ్యక్తి.

మాగంటి గోపీనాథ్ 2014 తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున జూబ్లీహిల్స్ శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్‌పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్‌పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్‌రెడ్డి తొలిసారిగా బరిలోకి దిగారు. జూబ్లీహిల్స్‌ ప్రజలు బీజేపీ వైపు చూసేందుకు ఆసక్తి చూపడం లేదు.

ఫిల్మ్ నగర్‌లోని బస్తీ నివాసి శ్రీలతారెడ్డి మాట్లాడుతూ, “ఫిల్మ్ నగర్ సెలబ్రిటీలకు ప్రసిద్ధి చెందింది.. ఎందుకంటే చాలా మంది ఇక్కడ నివసిస్తున్నారు. అయితే ఇక్కడ బస్తీలు కూడా చాలానే ఉన్నాయి. చాలా మంది రోజువారీ కూలీ పనులు చేస్తుంటారు. ఇక్కడికి చెందిన చాలా మంది మహిళలు పెద్ద బంగ్లాలలో సహాయకులుగా పనిచేస్తున్నారు. పురుషులు డ్రైవర్లుగా లేదా రోజువారీ కూలీ పనులకు వెళుతున్నారు. మాకు ఇక్కడ సరైన ప్రయాణ సదుపాయాలు కావాలి. సరైన రోడ్లు, నీటి వసతి లేదు. ఈ ప్రాంతం 24x7 ట్రాఫిక్‌తో నిండి ఉంటుంది. ప్రధాన రహదారులపై ఎక్కువగా జనం తిరుగుతున్నారు. అయితే వారు లోపలికి వచ్చి జూబ్లీహిల్స్‌కు అవతలి వైపు వెళ్లడానికి మరికొన్ని దారులు చూసుకోవాలి. మా వద్దకు వచ్చి మా పరిస్థితి ఏంటో చూసే నాయకులు కావాలి. గోపీనాథ్ మాగంటి సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి రావడంతో ఆయనకు మా సమస్యలు తెలుసు. కృష్ణానగర్‌లో కూడా అదే పరిస్థితి నెలకొంది." అని అన్నారు.

జూబ్లీహిల్స్ నివాసి అజ్మల్ సైనీ మాట్లాడుతూ "మొరాదాబాద్ నుండి ఎంపీ అయిన అజారుద్దీన్ ట్రాక్ రికార్డ్ ఘోరంగా ఉంది. కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి ఘోరంగా విఫలమయ్యాడు. అజర్ కు స్టార్ పవర్ ఉంది, కానీ అజర్ గెలిస్తే పేదల సమస్యల గురించి పట్టించుకుంటారా అనే అనుమానాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఆయనకు నిధుల అవసరం చాలా ఉందని కూడా నేను విన్నాను.. కాబట్టి అది మళ్లీ మైనస్ అయింది. గత టర్మ్‌లో గోపీనాథ్ బాగా పనిచేశారు. మైనారిటీ ఓట్లు అజహర్‌కు అనుకూలంగా పనిచేస్తాయి. స్టార్ పవర్‌ కూడా ఉండడంతో.. ఇవన్నీ ఓట్లుగా మార్చుకోగలిగే శక్తి ఉందని భావించడం లేదు.

మైనార్టీ ఓట్లపై దృష్టి:

హైదరాబాద్‌లో, పాతబస్తీ తర్వాత, జూబ్లీహిల్స్‌లో అధిక సంఖ్యలో మైనారిటీ ఓటర్లు ఉన్నారు. ఇది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. గత తొమ్మిదేళ్లుగా, ముస్లిం సామాజికవర్గం నుండి ఒక్క ఎమ్మెల్యేను గెలిపించుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది, అయితే AIMIM ఏడు స్థానాలను గెలుచుకుంది. అధికార BRS పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకుంది.

Next Story