పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ముందంజలో తీన్మార్ మల్లన్న

నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది.

By Srikanth Gundamalla  Published on  6 Jun 2024 11:11 AM GMT
graduate mlc election counting, congress, brs , Telangana,

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ముందంజలో తీన్మార్ మల్లన్న

నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. తాజాగా ఉపఎన్నిక రెండో రౌండ్‌ కౌంటింగ్ పూర్తయ్యింది. రెండో రౌండ్ తర్వాత లక్షా 92వేల మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు అధికారులు. మొదటి రౌండ్‌తో పోలిస్తే రెండో రౌండ్‌లో తీన్మార్ మల్లన్న మెజార్టీ కాస్త తగ్గింది. ఇక రెండు రౌండ్లు పూర్తయిన తర్వాత తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల మెజార్టీతో ముందున్నారు. కాగా.. తీన్మార్‌ మల్లన్న కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే.

రెండో రౌండ్‌లో పోల్‌ అయిన ఓట్ల వివరాలు చూస్తే.. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకు 34,575 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 27,573 ఓట్లు పోల్‌ అయ్యాయి. ఇక బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 12841 ఓట్లు రాగా.. స్వతంత్ర అభ్యర్థి అశోక్‌ పాలకూరికి 11,018 ఓట్లు వచ్చాయి. మొత్తంగా రెండు రౌండ్లు కలపి మల్లన్నకు 70,785 ఓట్లు, రాకేష్ రెడ్డికి 56,113 ఓట్లు, ప్రేమెందర్ రెడ్డికి 24,236 ఓట్లు, అశోక్ పాలకూరికి 20,037 ఓట్లు వచ్చాయి. ఇక మూడో రౌండ్‌ కౌంటింగ్‌ ప్రక్రియను ఎన్నికల సిబ్బంది ప్రారంభించారు.

ఇక తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలకపోవచ్చని ప్రధాన పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. రెండో ప్రాధాన్య ఓట్ల ద్వారా ఫలితం తేలుతుందని అంటున్నారు. ఇక పూర్తి ఫలితం వెలువడటానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాగా.. గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి జనగామ నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. దాంతో... ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. గత నెల 27వ తేదీన పోలింగ్ జరగ్గా ఇప్పుడు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీల మధ్య టైట్‌ ఫైట్‌ కొనసాగుతోంది. దాంతో.. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అందరిలో ఉంది.

Next Story