తెలంగాణ రాష్ట్రంలోని 2,216 లిక్కర్ షాపుల లైసెన్సులు అక్టోబర్ నెలతో ముగియనున్నాయి. ఈ లైసెన్సులు ముగిసిన తరువాత మద్యం షాపుల వేలం ప్రక్రియ ఉంటుంది. రాష్ట్రంలో సెప్టెంబర్ చివరినాటికి కొత్త మద్యం పాలసీని అమలులోకి తీసుకొచ్చేందుకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ వేలం లైసెన్స్ ఫీజులు పెంచాలని ప్రభుత్వం చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీజు నాలుగు స్లాబుల్లో ఉంది. అంటే రూ.45 లక్షలు, రూ.50 లక్షలు, రూ.80 లక్షలు, రూ.1.20 కోట్లు. ఈ ఫీజులను 5 శాతం నుంచి 8 శాతం పెంచాలి అనే ప్రతిపాదన ఉంది. వీటి ఫీజును పెంచితే.. అదనంగా రూ.1200 కోట్ల రూపాయల ఆదాయం లభించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఉన్న 2,216 లిక్కర్ షాపులతో పాటుగా అదనంగా మరో 200 లిక్కర్ షాపులను కూడా ప్రారంభించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లిక్కర్ షాపుల సంఖ్యను ప్రభుత్వం ఏనాడూ పెంచలేదు. కాగా.. ఇప్పుడు 200 షాపులకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే రాష్ట్రంలో కొత్తగా 80 బార్లకు అనుమతులు ఇచ్చినా వివిధ కారణాల వలన అవి ప్రారంభం కాలేదు. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం కొత్త లిక్కర్ షాపులకు పరిష్మన్ ఇస్తుందా అన్నది లేనిది ఇంకా తెలియాల్సి ఉంది.