'సాయం అందేలా చూస్తా'.. వరంగల్ వరద బాధితులకు గవర్నర్ హామీ

ఇటీవల భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

By అంజి  Published on  2 Aug 2023 7:17 AM GMT
governor tamilisai, Telangana floods, warangal, hanamkonda

'సాయం అందేలా చూస్తా'.. వరంగల్ వరద బాధితులకు గవర్నర్ హామీ

ఇటీవల భారీ వర్షాల కారణంగా వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా వరంగల్‌లో ముంపునకు గురైన ప్రాంతాల్లో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పర్యటించారు. మొదట నగరానికి చేరుకున్న గవర్నర్‌.. శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వదర ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. రెడ్‌ క్రాస్ సొసైటీ సమకూర్చిన హెల్త్ కిట్స్‌, నిత్యావసరాలను బాధితులకు అందజేశారు. భద్రకాళి చెరువు కట్ట మరమ్మతుల పనులను సైతం గవర్నర్‌ పరిశీలించారు.

అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ.. జిల్లాలోని ముంపు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వరంగల్‌లో వరదలు తీవ్ర స్థాయిలో వచ్చాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలు మొదలు పెట్టాలని సూచించారు. నగరంలో చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయన్న.. ఆమె ఇలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమస్య పరిష్కారానికి శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని అన్నారు. వాతావరణ శాఖ ముందే హెచ్చరించిన తరుణంలో.. ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తే ఇంత నష్టం ఉండకపోయేదన్నారు.

బాధితులకు తాగునీరు, నిత్యావసర వస్తువులు, మెడికల్ కిట్లు అందించాలని అన్నారు. అటు హన్మకొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై ఈ రోజు పర్యటించారు. జవహర్‌నగర్‌, నయీమ్ నగర్, భద్రకాళి బండ్, ఎన్టీఆర్ నగర్, ఎన్ఎన్ నగర్ లో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ముంపు ప్రాంతాల కాలనీల్లోని బాధితులను పరామర్శించిన గవర్నర్‌.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర బృందం వచ్చి నష్టాన్ని అంచనా వేస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ముంపు ప్రాంతాల్లో బాధితులకు రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయమని గవర్నర్ తమిళిసై కొనియాడారు.

Next Story