తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలం పాములపల్లి, భట్టిలగుంపు వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ పర్యటించారు. నీట మునిగిన పంట పొలాలను, రోడ్ల పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ముంపు ప్రాంతాల ప్రజలకోసం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను గవర్నర్ పరిశీలించారు. మహిళలు కన్నీరు పెట్టుకుంటూ గవర్నర్ కు బాధలు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో అందిస్తున్న ఆహారం, వైద్య సదుపాయాలను గవర్నర్ పరిశీలించారు. స్వయంగా వరద బాధితులకు అన్నం వడ్డించారు గవర్నర్ తమిళిసై.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు హైదరాబాద్ నుంచి రాత్రి రైలులో వెళ్లారు గవర్నర్ తమిళి సై. మణుగూరు చేరుకున్న గవర్నర్ కు అక్కడ ఆశ్వాపురం తహశీల్దార్ సురేష్, అడిషనల్ ఎస్పీ కేఅర్కే ప్రసాద్ స్వాగతం చెప్పారు. గవర్నర్ ప్రోటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వాగతం చెప్పాల్సి ఉన్నా హాజరుకాలేదు. గత రాత్రి అశ్వాపురంలోని హెవీవాటర్ ప్లాంట్ విశ్రాంతి భవనంలో గవర్నర్ బస చేశారు.