రాజ్‌భ‌వ‌న్‌లో ఘ‌నంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుక‌లు.. కొత్త భ‌వ‌నాలు నిర్మిచ‌డ‌మే అభివృద్ధి కాదు

Governor Tamilisai Soundararajan Hoists National Flag at Telangana Raj Bhavan.రాజ్‌భ‌వ‌న్‌లో 74వ గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌ను

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 Jan 2023 3:03 AM GMT
రాజ్‌భ‌వ‌న్‌లో ఘ‌నంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుక‌లు.. కొత్త భ‌వ‌నాలు నిర్మిచ‌డ‌మే అభివృద్ధి కాదు

రాజ్‌భ‌వ‌న్‌లో 74వ గ‌ణ‌తంత్ర వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. సైనికుల గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. అంత‌క‌ముందు సికింద్రాబాద్ సైనిక అమ‌ర‌వీరుల స్మార‌క స్థూపం వ‌ద్ద ఆమె నివాళుల‌ర్పించి వారి త్యాగాల‌ను స్మ‌రించుకున్నారు. వేడుక‌ల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

జాతీయ ప‌తాకాన్ని ఆవిష్క‌రించిన అనంత‌రం గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల‌కు గ‌ణ‌తంత్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. నా ప్రియ‌మైన తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అంటూ తెలుగులో ప్ర‌సంగాన్ని ప్రారంభించారు గ‌వ‌ర్న‌ర్‌. "ఎంద‌రో వీరుల త్యాగ ఫ‌లితం మ‌న స్వాతంత్రం. ప్ర‌పంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం క‌లిగిన దేశం మ‌న‌ది. నిజ‌మైన ప్ర‌జాస్వామ్యానికి రాజ్యాంగం దిక్సూచి. అభివృద్ధి అంటే భ‌వ‌న నిర్మాణం కాదు. జాతి నిర్మాణం." అని తమిళిసై అన్నారు.

తెలంగాణ‌కు ఘ‌న‌మైన, విశిష్ట‌మైన చ‌రిత్ర ఉందని, శ‌తాబ్దాల చ‌రిత్ర ఉన్న హైద‌రాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతుందన్నారు. వైద్యం, ఐటీ రంగాల్లో హైద‌రాబాద్ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల‌కు ప్ర‌ధాని మోదీ వందేభార‌త్ రైలును కేటాయించారని, రాష్ట్రాభివృద్ధికి అవ‌స‌ర‌మైన స‌హ‌కారాన్ని రాజ్‌భ‌వ‌న్ అందిస్తోందన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున హైవేలు నిర్మించిన ప్ర‌ధానికి ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

రాష్ట్రంలో గ‌వ‌ర్న‌ర్, ప్ర‌భుత్వం మ‌ధ్య పొలిటిక‌ల్ వారు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి గ‌ణతంత్ర వేడుక‌లు ఎక్కడ జరపాలి అనే అంశంపై కొంత సస్పెన్స్ కొనసాగింది. ఈ అంశంపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప‌రేడ్ గ్రౌండ్స్‌లో గానీ లేదా ఇత‌ర ఏ ప్రాంతంలోనైనా రిప‌బ్లిక్ డే వేడుక‌లు జ‌ర‌పాల‌ని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరేడ్ కూడా ఉండాలనీ, కేంద్రం గైడ్‌లైన్స్ పాటించాలని బుధ‌వారం స్పష్టం చేసింది. స‌మ‌యం ఎక్కువగా లేకపోవడంతో ముందుగా అనుకున్నట్లుగానే ఈసారి రాజ్‌భవన్ లోనే వేడుక‌ల‌ను నిర్వ‌హించారు.

Next Story