రాజీనామాలకు ఆమోదం తెలిపిన గవర్నర్ తమిళిసై
టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు.
By Medi Samrat
టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. ఈ రాజీనామాలపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అనంతరం న్యాయ సలహా తీసుకొని చైర్మన్ జనార్ధన్ రెడ్డితో పాటు ఐదుగురు సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సభ్యుల రాజీనామాల ఆమోదం నేపథ్యంలో త్వరలో కొత్త కమిషన్ ఏర్పాటు కానుంది. గత చైర్మన్, బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో మున్ముందు ఎవరూ ఆటలాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగుచూడటంతో జనార్ధన్ రెడ్డి ఆ సమయంలోనే రాజీనామా చేశారు. కానీ ఆయన రాజీనామాను అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. ప్రభుత్వం మారడంతో గత డిసెంబర్‌లో ఆయన మళ్లీ రాజీనామాను సమర్పించారు.
తాజాగా గవర్నర్ వారి రాజీనామాలను ఆమోదించారు. నిరుద్యోగుల భవిష్యత్తు కోసం వారి రాజీనామాలను ఆమోదించినట్లు పేర్కొన్నారు. కొత్త ఛైర్మన్, సభ్యుల నియామకానికి గవర్నర్ అనుమతించారు. పేపర్ లీకేజీ లాంటి విషయాలను సీరియస్ గా తీసుకుని.. సమగ్ర విచారణ జరిపి, దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్ గట్టిగా సూచించారు.