ముసాయిదాపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి తెలిపారు. బిల్లును ఆమోదించాలని గవర్నర్ తమిళిసైని కోరామని తెలిపారు. గవర్నర్ తమ సమస్యలు విన్నారని, సానుకూలంగా స్పందించారని చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుపై గవర్నర్ తమిళిసై స్పందన కోరుతూ కార్మికులు, ఉద్యోగులు రాజ్‌భవన్ ను ముట్టడికి పిలుపునిచ్చారు. అయితే గవర్నర్ మాత్రం కార్మిక నాయకులను చర్చలకు ఆహ్వానించారు. ఈ క్రమంలోనే గవర్నర్ గంటకుపైగా కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపారు.
చర్చల అనంతరం థామస్ రెడ్డి మాట్లాడుతూ.. గవర్నర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం రాగానే ముసాయిదాను సాయంత్రం వరకు అసెంబ్లీకి పంపేందుకు ప్రయత్నం చేస్తానని గవర్నర్ అన్నారని వెల్లడించారు. బిల్లును ఆమోదించాలని గవర్నర్ ను కోరామని తెలిపారు. రాజ్ భవన్- ప్రభుత్వం ఆలస్యం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని అన్నారు. ఎలాంటి డౌట్స్ ఉన్నా.. అసెంబ్లీకి బిల్లును పంపాలని గవర్నర్‌ను కోరామన్నారు. ఏదైనా ఉంటే అసెంబ్లీలో మేము మాట్లాడుకుంటామని గవర్నర్ తో చెప్పామన్నారు. బిల్లు ఇవ్వాలే ఆమోదం అవుతుందని ఆశిస్తున్నామన్నారు. మేమే ఆర్టీసీ కార్మికుల కోసం పోరాటం చేసామని.. రాజ్ భవన్ వద్దకు మేము పిలిస్తేనే కార్మికులు వచ్చారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ని మెప్పించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంకు ఒప్పించామన్నారు. అశ్వత్థామ రెడ్డి కార్మిక ద్రోహి అని విమర్శించారు. కార్మికుల మరణాలకు కారకుడు అశ్వత్థామ రెడ్డి అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.