తెలంగాణలో అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వారిని అనర్హులుగా గుర్తించే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వ సిద్ధమైనట్లు తెలుస్తోంది. చనిపోయిన వ్యక్తుల పేర్లతో కొందరు, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు, నకిలీ సదరం సర్టిఫికెట్‌తో పెన్షన్లు తీసుకుంటున్నారనే ఫిర్యాదులొచ్చాయి. మరోపక్క అధికారుల పర్యవేక్షణ లోపంతో అనేక మంది అనర్హులు చేయూత పథకం ద్వారా పెన్షన్ పొందుతున్నారు. పెన్షన్ పంపిణీలో అనేక అవకతవకలు చోటు చేసుకుని అనర్హులు దర్జాగా పెన్షన్ పొందుతున్నారు. దీంతో అనర్హులను గుర్తించాలని నిర్ణయించింది. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తనిఖీలు చేసేలా స్పెషల్ టీమ్ లు ఏర్పాటు చేయనుంది. వీళ్ల తనిఖీల ఆధారంగా అధికారులు అనర్హులను గురించనున్నారు.
ఈ నేపథ్యంలో పెన్షన్ల పంపిణీలో పారదర్శకతను పెంచడానికి, డిజిటల్ ఆడిట్ నిర్వహించడం ద్వారా అక్రమాలను గుర్తించి, వాటిని నివారించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. పెన్షన్ పొందేందుకు అనర్హులైన వారిని గుర్తించి, వారి పెన్షన్లను రద్దు చేసే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనున్నట్లు సమాచారం.పెన్షన్ల పంపిణీలో అవకతవకలను అరికట్టడానికి సామాజిక తనిఖీలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోంది.