కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ప్రాజెక్టుపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర హోం శాఖకు అధికారికంగా లేఖ రాసింది. కాళేశ్వరంపై నియమించిన జ్యుడీషియల్ కమిషన్ సమర్పించిన నివేదికను ఆధారం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ జరపాలని తెలంగాణ ప్రభుత్వం లేఖలో కోరింది. కేంద్ర రాష్ట్రాలకు చెందిన పలు శాఖల ప్రమేయం కారణంగా సీబీఐతో దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అంతరాష్ట్ర అంశాలపైనా దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసింది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌పై దర్యాప్తు చేయాలని రిక్వెస్ట్ చేసింది. కాగా రాష్ట్రంలో సీబీఐ నిషేధం విధిస్తూ తెచ్చిన జీవోను నేడు లేదా రేపు ఎత్తివేసే అవకాశం ఉంది. అయితే సీబీఐ నిషేధం పూర్తిగా ఎత్తివేస్తారా? లేదా ఈ ఒక్క కేసుకే పరిమితం చేస్తారా అనేది ఆసక్తిగా మారింది.