ధరణి పాపాలు రాష్ట్రమంతా పెరిగిపోయాయని, కాంగ్రెస్ తెచ్చిన భూమాత పోర్టల్‌ను అయినా సక్రమంగా అమలు చేయాలని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. మేడ్చల్ జిల్లా పోచారంలో పేదల భూముల కబ్జాపై కలెక్టర్, సీపీకి ఫిర్యాదు చేసినా పరిష్కారం దొరకలేదని, పేదల బాధ చూసి ఆవేశంలో దాడి చేసినట్లు ఈటల వివరణ ఇచ్చారు. రియల్టర్ల పేరుతో కొందరు దౌర్జన్యాలకు దిగుతున్నారని, పహిల్వాన్లను పెట్టి స్థానికులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు.
రేవంత్ సర్కార్ రావడంతోనే హైడ్రా పేరుతో పేదలపై విరుచుకుపడిందన్న ఆయన.. హైడ్రా, మూసీ బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని వెల్లడించారు. అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తే DOPTకి ఫిర్యాదు చేస్తామని ఈటల హెచ్చరించారు. ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో వారి దౌర్జన్యాలు చూస్తే అర్థమవుతుందని చెప్పారు. ధరణి లొసుగులతో రియల్టర్లు ఇష్టారీతిన భూములు మార్చుకున్నారని, అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఈటల మండిపడ్డారు. బాసుల మెప్పు కోసం కాదు, పేదలకు న్యాయం చేసేలా అధికారులు పని చేయాలని సూచించారు. ప్రభుత్వం తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడనంటూ ఈటల మాట్లాడారు.
కాగా నిన్న గ్యార ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదుతో మేడ్చల్ జిల్లా పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏకశిలనగర్‌లో సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా, ఈటెలతో పాటు 30 మంది దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.