తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..
Good news to Telangana Govt Employees.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు.
By తోట వంశీ కుమార్ Published on 17 March 2021 4:15 PM ISTతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. రెండు, మూడు రోజుల్లోనే గౌరవప్రదమైన పీఆర్సీ ప్రకటిస్తామని శాసనసభ వేదికగా సీఎం కేసీఆర్ చెప్పారు. ఉద్యోగులపై తమకెంత ప్రేమ ఉందో గత పీర్సీతోనే చూపించామన్నారు. మా ఉద్యోగులు కాలర్ ఎత్తుకుని ఇండియాలో తాము అత్యధిక జీతాలు పొందుతామని చెప్పుకునే విధంగా జీతాలు ఇస్తామని చెప్పాం.. దాన్ని అమలు చేస్తున్నామన్నారు. తాను ప్రకటించిన తర్వాత ఉద్యోగులు తప్పకుండా హర్షం వ్యక్తం చేస్తారన్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతోందన్నారు. కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు వైద్యఆరోగ్య శాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చెప్పారు. పూర్తిస్థాయిలో కరోనాను అదుపులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. రాష్ట్రంలోని పలు గురుకుల పాఠశాల్లలో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని.. దీనిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. నూతన సచివాలయ నిర్మాణంలో భాగంగా అప్పటికే ఉన్న ఆలయాలు తొలగించాల్సి వచ్చిందన్నారు. ఏ మతానికి చెందినవైనా సరే వాటిని అవే స్థలంలో పునర్నిర్మిస్తామని హామి ఇచ్చారు.
రాష్ర్టంలోని రైతులకు రుణమాఫీ వందకు 100 శాతం చేసి తీరుతామని స్పష్టం చేశారు. రూ.25 వేల వరకు ఎంత మందికి రుణాలు ఉండేవో.. వారికి గత సంవత్సరం మాఫీ చేశాం. మిగతా వారి విషయంలో రేపు ఆర్థిక మంత్రి ప్రకటన చేస్తారన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రుణమాఫీ చేయలేదన్నారు.