Telangana: సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త రేషన్ కార్డులు
ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
By అంజి Published on 5 July 2024 2:04 AM GMTTelangana: సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. త్వరలో కొత్త రేషన్ కార్డులు
ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సన్న బియ్యం పండించే రైతులను ప్రోత్సహిస్తామని వెల్లడించారు. వాటినే మిల్లింగ్ చేయించి రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. బియ్యాన్ని వినియోగదారులే తింటారు కాబట్టి రీసైక్లింగ్ ఆగిపోతుందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు.
గతంలో కేసీఆర్ దొడ్డు, సన్న వడ్లకు ఒకే రేటు ఇస్తామని చెప్పడంవల్లే రైతులు సన్న వడ్లు వేయలేదని, ఇప్పుడు మేం రూ.500 ప్రోత్సాహకం ఇవ్వడం వల్ల రైతులు సన్న వడ్లు పండిస్తున్నారని సీఎం అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాలను కలిసిన తర్వాత సీఎం రేవంత్ గురువారం అక్కడి తన అధికార నివాసంలో విలేకర్లతో మాట్లాడారు. ప్రధానమంత్రిని, కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చామన్నారు.
తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధానిని కోరినట్లు సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రాకు వదిలిపెట్టిందే కేసీఆర్ అని, ఇప్పుడు అవి కలపాలని డిమాండ్ చేయడం ఆయన చేతకానితనానికి నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వ పాలనకు మార్క్‌గా మూసీ నదిని డెవలప్ చేయాలనుకుంటున్నామని తెలిపారు. గండిపేట నుంచి రింగ్ రోడ్ వరకు సుమారు 55 కిలోమీటర్ల పొడవున దీని అభివృద్ధి ఉంటుందన్నారు. హైదరాబాద్ నీటి అవసరాలు తీర్చడానికి గోదావరి, కృష్ణా నుంచి గండిపేటకు 15 టీఎంసీలు తరలించేలా పెద్ద లైన్ వేస్తామని తెలిపారు.