ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సమస్యలు, సందేహాల నివృత్తి కోసం హైదరాబాద్ లోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ను, హెల్ప్ డెస్క్ ను గురువారం నాడు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాల్ సెంటర్ ఫోన్ నెం. 1800 599 5991 ను ఆవిష్కరించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఈ కాల్ సెంటర్ ప్రతి రోజూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు పనిచేస్తుందని ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించడంతోపాటు, వాటిని పరిష్కరించడంలో చొరవ చూపడానికి ఈ కాల్ సెంటర్ ను వినియోగించుకోవచ్చునన్నారు.
లబ్ధిదారుల ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు ఆధారంగా వివరాలను పరిశీలించి సమస్యను పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటారని నిర్ణీత గడువులోగా బిల్లులు జమ కాకపోవడం, ఎక్కడైనా ఎవరైనా సిబ్బంది ఫోటోలను అప్ లోడ్ చేయడంలో ఆలస్యం చేయడం, ఇతర సాంకేతిక సమస్యలు, అవినీతి ఆరోపణలు తదితర అంశాలపై ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వాటిని సంబంధిత అధికారుల వద్దకు తీసుకెళ్లి చర్యలు తీసుకుని లబ్ధిదారులకు కూడా ఆ వివరాలను తెలియచేస్తారని వివరించారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ, పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నామని, ఇప్పటికే ఇందిరమ్మ యాప్ ద్వారా మంచి ఫలితాలు సాధించామని, కృత్రిమ మేధ ( ఎఐ) ను కూడా విరివిగా వాడుతున్నామని, ఈ కాల్ సెంటర్ ద్వారా లబ్ధిదారులకు మరింత చేరువ అవుతున్నామని మంత్రి పేర్కొన్నారు. అవినీతికి ఎటువంటి ఆస్కారం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం 5 లక్షల రూపాయల సబ్సిడీతో పేదలకు ఇండ్ల నిర్మాణానికి సహాయం అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ విపి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.